Krishna Kowshik
Krishna Kowshik
ఇంట్లో పిల్లల్ని వదిలేసి భార్యాభర్తలిద్దరూ పని ఉందని బయటకు వెళ్లారు. అయితే వెళ్లే మార్గంలో బండి అదుపు తప్పి.. పక్కనే ఉన్న కాలువలో పడి భార్య కొట్టుకుపోయింది. ఇంటికి హడావుడిగా తిరిగి వచ్చిన భర్త.. భార్య కాలువలో పడి పోయిందని, తాను ప్రమాదం నుండి తృటిలో తప్పించుకుని వచ్చానంటూ బంధువులకు చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె మృతదేహం కోసం వెతుకుతూనే.. భర్తను అదుపులోకి తీసుకుని ఏం జరిగిందని ప్రశ్నించారు. అప్పుడు వచ్చింది అసలు నిజం. భార్య ప్రమాదవశాత్తూ కాలువలో పడలేదని, భర్తే అందులోకి తోసేసి హత్య చేశాడని. ఆమెను వదిలించుకునేందుకు కుట్రలకు తెరలేపాడని పోలీసులు నిర్ధారించారు.
ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలోని రామాపురానికి చెందిన పూజల శ్రీనుకు, పుల్లల చెరువు మండలం సిద్ధన్న పాలేనికి చెందిన కోటేశ్వరితో ఆరు సంవత్సరాల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే కొన్ని నెలల నుండి వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యను వదిలించుకోవాలని భావించిన శ్రీను.. ఆమెను బయటకు వెళ్దామని చెప్పి తీసుకెళ్లాడు. సాగర్ కాలువ దగ్గరకు రాగానే బండి ఆపి.. ఆమెను నీటిలోకి తోసేశాడు. బైక్ అదుపు తప్పి కాలువలో పడిపోవడంతో భార్య నీటిలో గల్లంతు అయినట్లు కుటుంబ సభ్యులకు కళ్లబొల్లి కబుర్లు చెప్పాడు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సాగర్ కాలువలో గల్లంతైన కోటేశ్వరి మృతదేహాన్ని త్రిపురాంతకం మండలంలోని విశ్వనాథ పురం సమీపంలో ఆదివారం గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం యర్రగొండ పాలెం ప్రభుత్వాసుప్రతికి తరలించారు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన భర్త శ్రీనును అరెస్టు చేసి.. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.