స్థానిక సంస్థల ఎన్నికలు: సీపీఎం ఇలా.. సీపీఐ ఇలా..

గడచిన సాధారణ ఎన్నికల్లో జనసేనతో కలసి చెట్టాపట్టాల్‌ వేసుకుని తిరిగిన సీపీఐ, సీపీఎంలు ఎన్నికల ఫలితాల ఆ తర్వాత.. జనసేన హ్యాండ్‌ ఇచ్చి బీజేపీతో జతకట్టడంతో కమ్యూనిస్టులు ఎవరిదారి వారు చూసుకున్నారు. ఈ క్రమంలో సీపీఎం పార్టీ ఏ పార్టీకి అనుకూలంగా ఉండకుండా.. తటస్థ వైఖరిని అనుసరిస్తుండగా.. సీపీఐ మాత్రం తెలుగుదేశం పార్టీ దారిలో నడుస్తోంది. సీపీఐ పార్టీలోని ఇతర నాయకులు తీరు ఎలా ఉన్నా.. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాత్రం చంద్రబాబు మనసెరిగి నడుచుకుంటున్నారు. ఎన్నికల తర్వాత నుంచి బాబు బాటలో నడిచిన రామకృష్ణ.. అమరావతి ఉద్యమం నుంచి బాబు తానా అంటే.. తందానా.. అంటున్నారనే విమర్శలున్నాయి.

ఈ విమర్శలకు తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిర్వహించిన సమావేశంలో సీపీఐ రామకృష్ణ చెప్పిన అభిప్రాయం మరింత బలం చేకూరుస్తోంది. టీడీపీ చెప్పిన అభిప్రాయానే సీపీఐ రామకృష్ణ కూడా ఎన్నికల కమిషన్‌కు చెప్పారు. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి.. తిరిగి నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోరారు. కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల నిర్వహణను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

అయితే సీపీఐ దారి ఇలా ఉంటే.. మరో కమ్యూనిస్టు పార్టీ అయిన సీపీఎం మాత్రం స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ రోజు సీపీఎం చెప్పిన అభిప్రాయాన్ని బట్టి ఆ పార్టీ వ్యవహరిస్తోన్న తీరును అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టనందున.. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని సీపీఎం స్పష్టం చేసింది. ఎలాంటి వివాదాలకు తావులేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఆ పార్టీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డను కోరడం విశేషం.

Show comments