iDreamPost
android-app
ios-app

ఇందిరా గాంధీతోనే రాజీనామా చేయించిన కమ్యూనిస్ట్‌ యోధుడు! సీతారాం ఏచూరి లైఫ్‌స్టోరీ

  • Published Sep 13, 2024 | 1:00 PM Updated Updated Sep 14, 2024 | 10:58 AM

Sitaram Yechury, Indira Gandhi, CPM, Communism: ఎర్రజెండా పార్టీల్లో ఉండే గొప్ప నాయకుల్లో ఈయన కూడా ఒకరు. పోరాటాలు, ప్రజా ఉద్యమాలతో సహవాసం చేసి.. మరణం తర్వాత కూడా ప్రజల పక్షం వహించిన ది రియల్‌ కమ్యూనిస్ట్‌ ఏచూరి సీతారాం లైఫ్‌ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Sitaram Yechury, Indira Gandhi, CPM, Communism: ఎర్రజెండా పార్టీల్లో ఉండే గొప్ప నాయకుల్లో ఈయన కూడా ఒకరు. పోరాటాలు, ప్రజా ఉద్యమాలతో సహవాసం చేసి.. మరణం తర్వాత కూడా ప్రజల పక్షం వహించిన ది రియల్‌ కమ్యూనిస్ట్‌ ఏచూరి సీతారాం లైఫ్‌ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Sep 13, 2024 | 1:00 PMUpdated Sep 14, 2024 | 10:58 AM
ఇందిరా గాంధీతోనే రాజీనామా చేయించిన కమ్యూనిస్ట్‌ యోధుడు! సీతారాం ఏచూరి లైఫ్‌స్టోరీ

వేరే ఏ పొలిటికల్‌ పార్టీ నాయకులనైనా సరే.. గొప్ప నేత, మంచి లీడర్‌, మహానేత, ప్రజా నాయకుడు అని సంభోదిస్తుంటారు. కానీ, ఒక్క ఎర్ర జెండా పార్టీ నాయకులను మాత్రం ‘కమ్యూనిస్టు యోధులు’ అని అంటారు. ఎందుకంటే.. వారి సిద్ధాంతం, వారి జీవితం, వారి ఉనికి అంతా పోరాటమే. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేసే యోధులు.. కమ్యూనిస్టులు. కానీ, ఇప్పుడు అందంతా లేదు.. కమ్యూనిజం మసకబారింది, కమ్యూనిస్టులు మారిపోయారనే విమర్శలు కూడా ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు మారి ఉంటారేమో కానీ, సిద్ధాంతం మారలేదు. అలాంటి బలమైన సిద్ధాంతాన్ని విద్యార్థి దశ నుంచి.. చివరి శ్వాస వరకు అంటిపెట్టుకొని.. కమ్యూనిజమే తన ఊరిపిగా, ప్రజల పక్షం వహించి, బడుగు బలహీన పీడిత వర్గాల గొంతుకై నిలిచి, మోస్ట్‌ పవర్‌ ఫుల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా ఇందిరా గాంధీని సైతం ఎదిరించి.. ఆమెతో రాజీనామా చేయించిన.. ‘ది రియల్‌ కమ్యూనిస్ట్‌’ సీతారం ఏచూరి గురువారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అణివేతను ఒప్పుకోని, అరాచకాలను సహించని అసలు సిసలైన ఎర్ర సూరీడు సీతారాం ఏచూరి. భావితరాల్లో స్ఫూర్తి నింపే.. ఆ అరుణతార లైఫ్‌ స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం..

ఏచూరి సర్వేశ్వర సోమయాజి – ఏచూరి కల్పకం దంపతులకు 1952 ఆగస్టు 12న జన్మించారు ఏచూరి సీతారాం. ఒకప్పటి మద్రాస్‌లో స్థిరపడిన తెలుగు కుటుంబం వీరిది. సీతారాంకు చిన్నతనం నుంచే వామపక్ష భావాజాలం అబ్బంది. ఎందుకంటే.. ఆయన తల్లి కల్పకం కూడా కమ్యూనిస్టే. ప్రముఖ సంఘసంస్కర్త దుర్గాబాయి దేశ్‌ముఖ్‌కు ఆమె శిష్యురాలు. ఏచూరి విద్యాభ్యాసమంతా ఢిల్లీలోనే సాగింది. ఢిల్లీ ఎస్టేట్‌ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించాడు. సీబీఎస్‌ఈ పరీక్షలో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు ఏచూరి. సెయింట్‌ స్టీఫెన్‌ కళాశాల నుంచి ఆర్థికశాస్త్రంలో బీఏ, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ పూర్తి చేశారు. ఏచూరి భార్య సీమా చిస్తీ ప్రస్తుతం న్యూస్‌ పోర్టల్‌ ‘ది వైర్‌’కు ఎడిటర్‌గా సేవలందిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా.. ఒక కుమారుడు ఆశిష్‌ 2021లో కొవిడ్‌తో చనిపోయారు. కుమార్తె అఖిల.. ప్రస్తుతం ఎడింబరో యూనివర్సిటీలో, సెయింట్‌ ఆండ్రూస్‌ వర్సిటీల్లో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. సీమా చిస్తీ కంటే ముందు.. ఏచూరి, ఇంద్రాణి మజుందార్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె వీణా మజుందార్ కూతురు. కొన్ని ఏళ్ల తర్వాత.. ఇంద్రాణితో విడాకులు తీసుకొని.. సీమాను పెళ్లి చేసుకున్నారు.

SFI నుంచి మొదలైన ప్రస్థానం..

విద్యార్థి దశ నుంచే ఏచూరి సీతారాం పోరాటాలు మొదలుపెట్టారు. 1974లో స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో చేరి.. విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. 1975లో భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్‌) సభ్యత్వం తీసుకున్నారు. అదే ఏడాది ఇందిరా గాంధీ ప్రభుత్వం పెట్టిన ఎమెర్జెన్సీలో అరెస్ట్‌ అయ్యారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జేఎన్‌యూ(జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ) విద్యార్థి నాయకుడిగా సీతారాం ఏచూరి మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978లో అఖిల భారత ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలా అంచెలంచెలుగా ఎదిగి, సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో, 1988లో కేంద్ర కార్యవర్గంలో, 1999లో పొలిట్‌ బ్యూరోలో ఏచూరికి చోటు దక్కింది. 2005, 2011లో పశ్చిమ బెంగాల్‌ నుంచి రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. ‘వాటీజ్‌ దిస్‌ హిందూ రాష్ట్ర’, సూడో హిందూయిజం ఎక్స్‌పోజ్డ్‌’, ‘క్యాస్ట్‌ అండ్‌ క్లాస్‌ ఇన్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌ టుడే’, ‘ఆయిల్‌ పూల్‌ డెఫిసిట్‌ ఆర్‌ సెస్‌ పూల్‌ ఆఫ్‌ డెఫిసిట్‌’ వంటి పుస్తకాలు రచించారు.

Sitaram yechury life story

రాజ్యసభ దద్దరిల్లేది..

సరైన కమ్యూనిస్టు చట్టసభల్లో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందనేది సీతారాం ఏచూరిని ఉదాహరణగా పేర్కొని చెప్పవచ్చు. విద్యార్థి దశ నుంచి ఎంతటివారితోనైనా భయం లేకుండా మాట్లాడేవారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నంత కాలం.. పార్లమెంటు దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలను తీసుకురావటంతో పాటు వాటిపై ప్రశ్నలు సంధించిన సభ్యునిగా మంచి గుర్తింపు పొందారు. 2015 మార్చి 3న బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్‌లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గింది. కేవలం నాలుగో సారి మాత్రమే రాజ్యసభ చరిత్రలో ఇలా జరిగింది. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం కోసం ‘కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌’ ముసాయిదాను రూపొందించడంలో మాజీ కేంద్ర మంత్రి చిదంబరంతో పాటు ఏచూరి కీలకంగా వ్యవహరించారు.

ఇందిరా గాంధీతో రాజీనామా..

సీతారాం ఏచూరి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ అదే యూనివర్సిటీకి ఛాన్సలర్‌గా ఉండేవారు. 1977లో ఎమెర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఓడిపోయాక కూడా జేఎన్‌యూ ఛాన్సలర్‌గా కొనసాగడాన్ని.. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడిగా ఉన్న సీతారాం ఏచూరి తీవ్రంగా వ్యతిరేకించారు. భారత దేశ రాజకీయ చరిత్రలో ఇందిరా గాంధీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోనే మోస్ట్‌ పవర్‌ ఫుల్‌ ఉమెన్‌గా ఎదిగారు ఇందిరా గాంధీ. అలాంటి వ్యక్తి ఇంటి ముందు ధర్నా చేసి.. ఆమె జేఎన్‌యూ ఛాన్సలర్‌గా తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు ఏచూరి. వందల మంది విద్యార్థులతో కలిసి నిరసనకు దిగారు.

Sitaram yechury life story

తన ఇంటి ముందు ధర్నాకు దిగిన జేఎన్‌యూ విద్యార్థులతో ఇందిరా గాంధీ స్వయంగా వచ్చి మాట్లాడారు. ఆ సమయంలో జేఎన్‌యూ ఛాన్సలర్‌గా కొనసాగేందుకు ఇందిరా గాంధీ ఎందుకు అనర్హురాలో, ఆమె ఎందుకు ఆ పదవికి రాజీనామా చేయాలో వివరిస్తూ.. ఒక మెమోరాండమ్‌ను ఇందిరా గాంధీకి చదవి వినిపించారు సీతారాం ఏచూరి. ఒక మాజీ ప్రధాని, మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ఉమెన్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ కూతురి ముందు నిల్చోని.. ఆమెకు వ్యతిరేకంగా ఒక మెమోరాండమ్‌ను ఏ మాత్రం భయపడకుండా, కాస్త కూడా జంకకుండా.. చదివివినిపించిన ఏచూరి ధైర్యానికి, తెగువకు అక్కడున్న విద్యార్థులు సైతం ఆశ్చర్యపోయారు. అది జరిగిన కొద్ది రోజులకే ఇందిరా గాంధీ జేఎన్‌యూ ఛాన్సలర్‌ పదవికి రాజీనామా చేశారు.

మృత్యువు తర్వాత కూడా ప్రజల కోసమే..

బతికినంత కాలం.. ప్రజల పక్షం వహించిన ఏచూరి, చావు తర్వాత కూడా ఈ దేశ ప్రజలకే ఉపయోగపడనున్నారు. వందల ఎకరాల్లో సమాధి కాకుండా.. ఒక మెడికల్‌ కాలేజీ ల్యాబ్‌లో వైద్య విద్యార్థుల కోసం ఉపయోగపడే ‘రిసెర్చ్‌ మెటీరియల్‌’ మారనున్నారు సీతారాం ఏచూరి. అంత్యక్రియలు చేయకుండా.. ఆయన చివరి కోరికగా.. తన పార్థీవదేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా ఎయిమ్స్‌ మెడికల్‌ కాలేజీకి ఆయన కుటుంబ సభ్యులు అప్పగించనున్నారు. 72 ఏళ్ల వయసులో న్యుమోనియాతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఇలా.. జీవితం మొత్తం ప్రజలకు అంకితం ఇచ్చి.. తనువు చాలించిన తర్వాత కూడా ప్రజలకే ఉపయోగడుతున్న ఏచూరి.. ఎందుకి స్ఫూర్తి. మరి ఈ అసలు సిసలైన కమ్యూనిస్ట్‌ జీవితంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.