iDreamPost
android-app
ios-app

సాంస్కృతిక రాజధానిలో కరోనా డేంజర్ బెల్

సాంస్కృతిక రాజధానిలో కరోనా డేంజర్ బెల్

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన రాజమహేంద్రవరంలో కరోనా వైరస్ డేంజర్ బెల్ మోగిస్తోంది. నగరంలో కొత్తగా ఈ రోజు ఆరు కేసులు వెలుగు లోకి వచ్చాయి. దీంతో నగరంలో మొత్తం వైరస్ సోకిన వారి సంఖ్య 18 మందికి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 32 కేసులు నమోదు కాగా అందులో 18 కేసులు రాజమహేంద్రవరంలో నే నమోదవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈరోజు వెలుగులోకి వచ్చిన ఆరు కేసులు గతంలో క్వారంటైన్ లో ఉన్న వారే కావడం గమనార్హం.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీ మార్కజ్ కు దాదాపు 33 మంది వెళ్ళారు. వీరందర్నీ అధికారులు ఒక క్వారంటైన్ కి తరలించారు. దాదాపు 28 రోజుల తర్వాత వైరస్ లక్షణాలు ఏమీ లేకపోవడంతో వారందరినీ పంపించారు. పంపించిన తర్వాత వారికి కరోనా రావడం అధికారులకు అంతుబట్టడంలేదు.క్వారంటైన్ లో ఉన్న సమయంలో పలుమార్లు పరీక్షలు చేనా.. కరోనా నెగిటివ్ వచ్చింది. అందుకే వారిని డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత వైరస్ లక్షణాలు కనిపించడం, పరీక్షలు చేస్తే పాజిటివ్ రావడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. మహమ్మారి కరోనా వ్యవహారం వైద్య నిపుణులు సైతం ఏమాత్రం అంతుచిక్కడం లేదు.

గోదావరి జిల్లాల వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన రాజమహేంద్రవరంలో కరోనా డేంజర్ బెల్ మోగిస్తుండడంతో.. నగరాన్ని నలువైపులా దిగ్బంధించారు. దీంతో నగరవాసులు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పలు ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించడం తో నగర జీవనం పూర్తిగా స్తంభించింది.