ఆరోగ్య శ్రీ పరిధిలోకి కరోనా … జగన్ కీలక నిర్ణయం

కరోనా వైరస్ ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తు జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం ఎంతగా పాపులరయ్యిందో అందరికీ తెలిసిందే. ప్రపంచం మొత్తాన్ని వణికించేస్తున్న ఈ వైరస్ మనదేశంలో కూడా వ్యాపిస్తోంది. ఇందులో భాగంగా ఏపిలో కూడా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. అసలే పేద ప్రజలు ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రంలో కరోనా కూడా సోకితే అంతే సంగతులు.

ఈ విషయమై అన్నీ కోణాల్లో చర్చించిన తర్వాత సోమవారం రాత్రి జరిగిన ఉన్నతస్ధాయి సమీక్షలో వైరస్ ను కూడా ఆరోగ్యశ్రీ పథకంలోకి చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. 15 రకాల ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలోకి చేరుస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వైరస్ అనుమానిత లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన రోగులకు వైద్యం నిమ్మితం రూ. 10.774 ప్రభుత్వం చెల్లిస్తుంది.

అలాగే వైరస్ నిర్ధారణ అయిన రోగుల చికిత్స కోసం రూ. 65 వేల నుండి రూ. 2.14 లక్షల వరకూ చెల్లించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇదే సమయంలో వైద్యం చేసే డాక్టర్లకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిట్ కోసం రూ. 5631 చెల్లించనున్నట్లు కూడా జీవోలో స్పష్టంగా చెప్పింది. మొత్తం మీద వైరస్ ను ఆరోగ్యశ్రీ పథకంలోకి చేర్చటం వల్ల అనేకమంది పేదలకు సాయంగా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం అందరూ చూస్తున్నదే.

నిజానికి ఇటువంటి వైరస్ వెలుగు చూడటం ఇదే మొదటిసారి. కాబట్టి వైద్యం కూడా కష్టంగానే ఉంటోంది. అలాంటపుడు వైరస్ సోకిన పేదలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుందని చెప్పటమంటే ఇబ్బందే అనుకోవాలి. ఎందుకంటే బాగా డబ్బులున్న వాళ్ళు ఎలాగూ ఖరీదైన వైద్యం చేయించుకుంటారు. మరి వైరస్ సోకిన మధ్య తరగతి ప్రజల మాటేమిటి ? వీళ్ళ గురించి కూడా ప్రభుత్వం కాస్త ఆలోచిస్తే బాగుంటుంది . ఎందుకంటే వైరస్ కు ధనవంతులు, పేదలన్న తేడా లేదుకదా ?

Show comments