iDreamPost
android-app
ios-app

‘వి’ నిర్ణయం తీసుకున్నారా

  • Published Mar 14, 2020 | 5:03 AM Updated Updated Mar 14, 2020 | 5:03 AM
‘వి’ నిర్ణయం తీసుకున్నారా

న్యాచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన వి రిలీజ్ తాలూకు అయోమయం ఇంకా తీరడం లేదు. ఎప్పుడో రెండు నెలల క్రితమే మార్చి 25న ఉగాది పండగ సందర్భంగా వి విడుదల చేస్తామని యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ ఇప్పుడు మొత్తం పరిస్థితులు తారుమారయ్యాయి. కరోనా చాప కింద నీరులా పాకుతోంది. మరణాల సంఖ్య భారీగా లేకపోయినా బయటపడుతున్న పాజిటివ్ కేసుల వల్ల జనంలో భయాందోళనలు పెరుగుతున్నాయి.

దీనికి తోడు కర్ణాటకలో కొన్నిరోజులు అన్ని థియేటర్లు మూసేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్ళు కూడా మూసేశారు. ఢిల్లీ, బీహార్, జమ్మూ కాశ్మీర్ లోనూ ఇదే పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో ఇంకొక్క కేసు నమోదైనా ఇక్కడా అదే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వి సినిమాని వాయిదా వేయక తప్పదనే మాట ట్రేడ్ నుంచి బలంగా వినిపిస్తోంది. నాని మార్కెట్ దృష్ట్యా దీని మీద బయ్యర్లు చాలా ఇన్వెస్ట్ చేశారు. అది రిస్క్ లో పడకూడదు అంటే జనం ఎప్పటిలాగే ఎలాంటి భయం లేకుండా హాల్స్ కు రావాలి. కానీ అది అంత ఈజీగా కనిపించే సూచనలు లేకపోవడంతో అంతర్గతంగా ఇప్పటికే నాని విని వాయిదా వేసే దిశగా ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని అంతర్గత సమాచారం.

ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకో మూడు నాలుగు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకపక్క బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలే రిస్క్ తీసుకునే ఆలోచన చేయకుండా అఫీషియల్ గానే పోస్ట్ పోన్లను చెప్పేస్తున్నారు. తెలుగు సినిమాల వరకు ఖచ్చితంగా చెప్పిన డేట్ కే కట్టుబడితే వసూళ్ల పరంగా ఎంతో కొంత రిస్క్ లో పడాలి. అందుకే ‘వి’ని ఇంకొద్ది రోజులు ఆగి రిలీజ్ చేస్తే బెటరనే కంక్లూజన్ కు వచ్చారట. అధికారికంగా చెప్పే దాకా వేచి చూడాలి. ఇదే సంకట స్థితిని అదే డేట్ కి ప్లాన్ చేసుకున్న ఒరేయ్ బుజ్జి, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా టీంలు ఎదురుకుంటున్నాయి. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే తెలుగువారికి ఈ ఉగాదికి సినిమా రుచులు లేనట్టే.