iDreamPost
android-app
ios-app

పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో.. క‌రోనా టెన్ష‌న్..!

పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో.. క‌రోనా టెన్ష‌న్..!

మేయ‌ర్ కు మ‌ళ్లీ టెస్ట్..?

త‌మిళ‌నాడు రాష్ట్రంలోని డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అన్బళగన్ మృతి రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. పుట్టిన రోజు నాడే.. క‌రోనా మ‌హ‌మ్మారికి ఆయ‌న బ‌లి కావ‌డం రాజ‌కీయ నేత‌ల్ని ఉలిక్కి ప‌డేలా చేస్తోంది. ఈయ‌న‌తో పాటు సాధార‌ణ పౌరులు క‌లిపి ఆ రాష్ట్రంలో ఇప్పటికే మొత్తం 280 మందికి పైగా మరణించారు. రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాకు కూడా ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ రావ‌డం క‌ల్లోలం రేపింది. జ‌లుబు, ద‌గ్గుతో బాధ ప‌డుతుండ‌డంతో కొద్ది రోజుల క్రితం ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ కు కూడా క‌రోనా ఏమోన‌నే అనుమానాలు త‌లెత్తాయి. ఆయ‌న స్వీయ నిర్బంధంలోకి కూడా వెళ్లారు. అయితే.. క‌రోనా టెస్టుల్లో నెగెటివ్ రావ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. క‌రానాతో చ‌నిపోయిన తొలి రాజ‌కీయ నాయ‌కుడు అన్బళగన్ అని అంద‌రూ పేర్కొంటున్నారు కానీ… ఏప్రిల్ నెల‌లోనే గుజ‌రాత్ రాష్ట్రం అహ్మ‌దాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేత బ‌క్రుద్దీన్ షేక్ కూడా క‌రోనా సోకి మృతి చెందారు. ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శక్తిసిన్హ్ గోహిల్ ఈ విష‌యాన్ని అప్ప‌ట్లో వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ నాయ‌కుల‌కు కూడా ఈ క‌రోనా ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. దీని వ‌ల్ల చాలా మంది ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు భ‌య‌ప‌డుతున్నారు. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు విశాఖ‌ప‌ట్ట‌ణంలోని ఎల్జీ పాలిమ‌ర్స్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు హైద‌రాబాద్ నుంచి ఆంధ‌ప్ర‌దేశ్ కు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆయ‌న బాధితుల‌ను ప‌రామ‌ర్శించ లేదు. మ‌హానా‌డు అనంత‌రం ఆయ‌న తిరిగి హైద‌రాబాద్ వెళ్లిపోయారు. క‌రోనా భ‌యంతోనే ఆయ‌న వెనుదిరిగిన‌ట్లు విప‌రీతంగా ప్ర‌చారం జ‌రిగింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాత్రం బాధితుల‌ను నేరుగా ఆస్ప‌త్రికే వెళ్లి ప‌రామ‌ర్శించారు. జ‌గ‌న్, వైసీపీ నేత‌లు మిన‌హా బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన ఇత‌ర పార్టీల రాజ‌కీయ నేత‌లు ఎవ‌రూ లేరు. దీనికి క‌రోనా భ‌య‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది. ఇదిలా ఉండ‌గా… మంత్రి‌, ప‌లువురు ఎమ్మేల్యేల కుటుంబాల్లోనూ క‌రోనా క‌ల‌క‌లం సృష్టించింది. క‌ర్నూలు, గుంటూరు జిల్లాల‌కు చెందిన రాజ‌కీయ నేత‌ల కుటుంబాల్లోనూ వైర‌స్ అల‌జ‌డి రేపింది.

ఇక తెలంగాణ‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కులు కూడా క‌రోనా ఫీవ‌ర్ తో ఒణుకుతున్నారు. లాక్ డౌన్ స‌మ‌యంలో నేత‌లు ఎవ‌రూ బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో స్వ‌యానా సీఎం కేసీఆర్ సీరియ‌స్ అయ్యారు. రోడ్ల‌పైకి వ‌చ్చి ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని ఆదేశించ‌డంతో.. కొంద‌రు ఎమ్మేల్యేలు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చారు. ప‌ది రోజుల క్రితం మాజీ ఎమ్మేల్యే, బీజేపీ సీనియ‌ర్ నేత చింత‌ల రామ‌చంద్రారెడ్డికి, ఆయ‌న త‌ల్లికి పాజిటివ్ రావ‌డంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందారు.

మేయ‌ర్ కు నెగెటివ్.. డిప్యూటీ మేయ‌ర్ కు పాజిటివ్

కొద్ది రోజుల క్రితం అడిక్‌మెట్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నజీహెచ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్.. ఓ హోటల్‌లో టీ తాగారు. అనంత‌రం ఆ హోట‌ల్ కు చెందిన సిబ్బందిలో ఒక‌రికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మేయ‌ర్ విష‌యంలో కూడా అనుమానాలు త‌లెత్తాయి. దీంతో కొన్ని రోజులు ఇంట్లోనే ఉండి అనుమానాల నివృత్తి కోసం ఆయ‌న కరోనా టెస్టు చేయించుకున్నారు. రిపోర్టులో నెగటివ్ అని తేలడంతో ఇప్పుడు మ‌ళ్లీ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. కొత్త‌గా ఏర్ప‌డ్డ బ‌డంగ్ పేట మున్సిప‌ల్ కార్పొరేష‌న్ డిప్యూటీ మేయ‌ర్ కుటుంబంలో ఒక‌రికి పాజిటివ్ వ‌చ్చింది. అనంత‌రం డిప్యూటీ మేయ‌ర్ కు కూడా పాజిటివ్ అని తేలింది.

ఇప్పుడు మ‌రోసారి…

జీహెచ్ఎంసీ మేయ‌ర్ పేషీలోని అటెండ‌ర్ కు గ‌తంలో వైర‌స్ సోకింది. ఇప్పుడు తాజాగా మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ డ్రైవ‌ర్ కు పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. డ్రైవ‌ర్ కు ఎలాంటి ల‌క్ష‌ణాలూ లేక‌పోవ‌డంతో మేయ‌ర్ కుటుంబంతో స‌న్నిహితంగానే మెలిగేవాడు. ప‌రీక్ష‌ల ఫ‌లితం వ‌చ్చే వ‌ర‌కూ డ్రైవ‌ర్ డ్యూటీలోనే ఉన్నాడు. బుధ‌వారం చేసిన ప‌రీక్ష‌ల రిజ‌ల్ట్ గురువారం వ‌చ్చింది. పాజిటివ్ తేలింది. దీంతో మేయ‌ర్ మ‌రో సారి ప‌రీక్ష‌లు చేయించుకునే అవ‌కాశం ఉంది. ముందు జాగ్ర‌త్త‌గా ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు, స‌న్నిహితుల‌కు దూరంగా ఉంటున్నారు. మొత్త‌మ్మీద‌.. క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఆందోళ‌న క‌లిగిస్తోంది.