Idream media
Idream media
ఇందు మూలముగా యావన్మందికీ తెలియజేయడమేమనగా అనంతపురం జిల్లాలో, ముఖ్యంగా హిందూపురం పరిసర ప్రాంతాలలో కరోనా వైరస్ ఎక్కువగా ఉన్నందునా అయా ప్రాంతాల నుంచి ఎవరూ మన గ్రామాల్లోకి రాకూడదు. మన గ్రామాల నుంచి అక్కడకు ఎవరూ వెళ్లకూడదు. ఈ కట్టుబాటను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై గ్రామ పెద్దలు కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పడమైనదహో… ఇదీ అనంతపురం జిల్లా సరిహద్దు కర్ణాటక రాష్ట్రంలోని పల్లెల్లో తాగాజా జరుగుతున్న పరిస్థితి.
అనంతపురంలో శుక్రవారం వరకు 118 మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. ఇందులో 8 మంది చనిపోగా, 54 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. మరో 56 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు పరిస్థితి అదుపులోనే ఉంది. అయితే ఇటీవల మహారాష్ట్రలోని థానే నుంచి ఉపాధికి వెళ్లిన వారు 650 మంది, తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లిన వారు 310 మంది తిరిగి స్వగ్రామాలకు వచ్చారు. థానే నుంచి వచ్చిన వారిలో ముగ్గురుకు, కోయంబేడు నుంచి వచ్చిన వారిలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు నిర్థారించారు. మరో 51 మంది అనుమానితులు ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే పొరుగురాష్ట్రం కర్ణాటక సరిహద్దు గ్రామాల ప్రజలు ముందుగా అప్రమత్తం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయా గ్రామాల నుంచి రాకపోకలు, అనంతపురం జిల్లా నుంచి బంధువులు ఎవరూ రాకూడదనే షరతుతో గ్రామాల్లో దండోరా వేయిస్తున్నారు. కరోనా ప్రారంభంలో పలు ప్రాంతాల్లోని గ్రామాలకు ఎవరూ రాకుండా ముళ్ల కంచెలు వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి హెచ్చరికలతో ఎవరికి వారు అప్రమత్తమవుతున్నారు.