భయం గుప్పిట్లో కర్నూల్ జిల్లా.. నంధ్యాల లో కర్ఫ్యూ..

  • Published - 06:59 AM, Mon - 6 April 20
భయం గుప్పిట్లో కర్నూల్ జిల్లా.. నంధ్యాల లో కర్ఫ్యూ..

డిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ఉదంతం బయట పడ్డాక రాష్ట్రంలో కర్నూల్ జిల్లా నుండే ఈ సభలకు ఎక్కువ మంది హాజరైన నెపధ్యంలో అందరూ భయపడ్డట్టే జరిగింది. ఆదివారం ఒక్కరొజే జిల్లాలో 52 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో కరొనా ప్రమాద ఘంటికలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఒక్కసారిగా జిల్లాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 56 కి చేరింది.

మరో రెండు రోజుల్లో మరిన్ని అనుమానితుల శాంపిల్స్ ల్యాబ్ నుండి రానున్న తరుణంలో ఈ సంఖ్య రెట్టింపు అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన కరోనా కేసుల్లో ఏకంగా 55 మంది ఢిల్లీ సభకు వెళ్లి వచ్చినవారే కావడం గమనార్హం. జిల్లాలో తాజా పరిస్థితులపై కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి మూడు విడతలుగా వచ్చిన నివేదికలను అధికారులు విడుదల చేశారు.

పాజిటివ్‌ కేసులందరిని హుటాహుటిగా నంద్యాల శాంతిరాం హాస్పిటల్‌కు తరలిస్తున్నారు. నెగిటివ్‌ రిపోర్టులు వచ్చిన వారిని మరో 14 రోజులు హోం క్వారంటైన్లలో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి కోసం హోటళ్లు, ప్రైవేట్‌ భవనాలలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటివరకు కరొనా భాదితులంతా ఢిల్లీ నుంచి వచ్చిన వారే కావడంతో వారందరినీ గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు.

కాగ, మార్చి నెలాఖరు నుంచి ఇప్పటివరకు ఇలా 357 మందిని అధికారులు గుర్తించారు. వీరిలో 338 మంది బ్లడ్ శాంపిల్స్ ను అనంతపురం ల్యాబ్‌కు పంపించారు. మూడు విడతలుగా 189 మంది రిపోర్టులు వచ్చాయి. ఇందులో 52 మందికి కరోనా సోకినట్లు తేలింది. 137 మందికి కరోనా లేదని నిర్ధారించారు. మరో 156 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ఆదివారం ప్రకటించిన పాజిటివ్‌ జాబితాలో కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, కోడుమూరు తదితర ప్రాంతాల వారు ఎక్కువగా ఉన్నారు

ఇదిలా వుంటే విదేశాలు, ఢిల్లీ సమావేశం నుంచి వచ్చిన 848 మందిని అధికారులు ఇప్పటిదాకా గుర్తించారు. వీరిలో 463 మంది నమూనాలను పరీక్షల నిమిత్తం అనంతపురం ల్యాబ్‌కి పంపారు. ఇందులో 307 మంది నివేదికలు రాగా అన్నీ నెగిటివ్ గానే తేలాయి. ఇప్పటివరకు మొత్తం 56 పాజిటివ్‌ కేసులు నమోదు కాగ, పాజిటివ్‌ కేసుల్లో ఒక్క రాజస్థాన్‌కు వెళ్లొచ్చిన వ్యక్తి మినహా మిగిలిన 55 కేసులు ఢిల్లీ కాంటాక్ట్‌ కేసులు కావడం ఆందోళన కలిగిస్తోంది.

నంద్యాల పట్టణంలో పది, రూరల్‌లో రెండు కేసులు నమోదు కావడం ఈ ప్రాంతంలో కలకలం రేపింది. ఈ దృష్ట్యా ఆయా ప్రాంతాలను ప్రభుత్వ అధికారులు రెడ్‌ జోన్లుగా ప్రకటించారు. నంద్యాలలో కరోనా పాజిటివ్‌ కేసులు వెల్లడైన నేపథ్యంలో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన కట్టుదిట్టమైన లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు నిర్ణయించారు. సోమవారం నుంచి 48 గంటలపాటు నిర్బంధ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ఆదివారం మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటకృష్ణ ప్రకటించారు.

48 గంటల వ్యవధిలో ప్రజలు ఎవరూ కూడా ఇళ్ళల్లో నుంచి బయటకు రాకూడదని, రోడ్లపై కనిపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 48 గంటల కర్ఫ్యూ తరువాత నిత్యావసర వస్తువులు, కూరగాయలను సైతం ప్రజల ఇంటి వద్దకే చేర్చేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలందరూ కరోనా విపత్తును కట్టడి చేసేందుకు సహకరించాలని, స్వీయ నిర్బంధంలో ఉండి భాగస్వామ్యులు కావాలని కమిషనర్‌ పిలుపునిచ్చారు.

Show comments