Idream media
Idream media
కరోనా వైరస్ మృత్యుహేళ చేస్తున తరుణంలో ప్రపంచం అంతా ఓ వైపు, కరోనా వైరస్ మరో వైపు అన్నట్లుగా పోరు సాగుతోంది. తమ మధ్య ఉన్న వైరాలు, శతృత్వాలు, పాత పగలను పక్కనపెట్టి ప్రపంచంలోని దేశాలు ఒకరినొకరు సహాయం చేసుకుంటున్నాయి. తమ ఉమ్మడి శతృవైన కరోనాను అంతం చేసేందుకు శాయశక్తులా పోరాడుతున్నాయి.
అమెరికా, రష్యాల మధ్య ఉన్న వైరం ప్రపంచానికి తెలిసిందే. ఇప్పుడు ఆ వైరాన్ని మరచిన రష్యా కరోనాతో అల్లాడిపోతున్న అమెరికాకు ఆపన్నహస్తం అందించింది. ప్రపంచంలోకెళ్లా అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు అమెరికాలో నమోదవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారు దాదాపు 9 లక్షల మంది ఉండగా.. అందులో ఒక్క అమెరికాలోనే దాదాపు రెండు లక్షల బాధితులున్నారు.
బాధితులు సంఖ్య పెరిగిపోతుండడంతో అమెరికాలో మాస్క్‌లు, సానిటైజర్లు, ఇతర వైద్య పరికరాలు కొరత ఏర్పడింది. ఈ సమయంలో నేనున్నానంటూ రష్యా చేయూతనిస్తోంది. వైద్య సామాగ్రిని అమెరికాకు పంపేందుకు సిద్ధమైంది. వైద్య పరికరాలు, ఇతర రక్షణ వస్తువులతో కూడిన మిలటరీ విమానం మాస్కో నుంచి అమెరికాకు వెళ్లింది. అంతకు ముందు రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది.
1990వ దశకం వరకూ ప్రపంచంలో అమెరికా, రష్యా అగ్రరాజ్యాలుగా కొనసాగాయి. యూఎస్‌ఎస్‌ఆర్ విచ్ఛిన్నం తర్వాత రష్యా బలహీనపడింది. అంతకు ముందు అమెరికా, రష్యాలు నువ్వా నేనా అన్నట్లు ప్రతి రంగంలో పోటీ పడేవి. తమతో కలిసి వచ్చే దేశాలతో రెండు అగ్రరాజ్యాలు కూటములు కట్టి పరోక్ష యుద్దం చేశాయి. అంతరిక్షం నుంచి ఆయుధాల వరకూ, సాంకేతిక పరిజ్ఞానం నుంచి ఆటల పోటీల వరకూ ప్రతి అంశంలో ఇరు దేశాలు హోరా హోరిగా పోటీ పడేవి.
యూఎస్‌ఎస్‌ఆర్ విచ్ఛన్నం తర్వాత అమెరికా ఒక్కటే అగ్రరాజ్యంగా అవతరించింది. నేటికీ రష్యా, అమెరికాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయినా మానవాళి మనుగడకే ముప్పు పరిణమించిన ఈ తరుణంలో పాత పగలను పక్కనబెట్టిన రష్యా, అమెరికాకు అండగా నిలబడి ప్రపంచ మన్ననలను అందుకుంటోంది.