iDreamPost
iDreamPost
కరోనా కారణంగా ఎదురయ్యే సమస్యల కంటే ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి కారణంగా ఎదుర్కోవాల్సిన సవాళ్లే పెద్ద సమస్యగా మారేలా కనిపిస్తోంది. ఓవైపు ఆదాయం పడిపోతూ, రెండోవైపు ఖర్చులు పెరుగుతున్న తరుణంలో ఆయా ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారబోతోంది. ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. కేంద్రం వైపు ఆశాభావంతో ఎదురుచూస్తున్నాయి. తాజాగా ప్రధానమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పలువురు ముఖ్యమంత్రులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. తమ తమ రాష్ట్రాలు ఆదుకోవాలని కోరారు. తగిన స్థాయిలో నిధులు విడుదల చేయాలని విన్నవించారు. ఇప్పటి వరకూ కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వెలువడ లేదు. దాంతో ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తగిన కసరత్తుల వైపు అంతా దృష్టి పెట్టారు.
దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలు కారణంగా అనేక రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా పడిపోయింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి వెళుతున్న పన్నుల కన్నా..తక్కువ మోతాదులోనే తిరిగి కేంద్రం చెల్లిస్తోంది. దాంతో ఇప్పటికే పలువురు అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. అయినా జాతీయ విధానంలో మార్పురానంత వరకూ వాటా పెరిగే అవకాశం లేదు. ఇక ఈసారి జీఎస్టీ సహా వివిధ పన్నుల ఆదాయం పూర్తిగా కోల్పోయే ప్రమాదం దాపురిస్తోంది. కొత్త సంవత్సరం తొలినాళ్లలోనే అలాంటి సమస్య ఉత్పన్నం కావడంతో రానురాను ఎలా ఉంటుందోననే విషయం అంతుబట్టడం లేదు. లాక్ డౌన్ సడలించినప్పటికీ వెంటనే పరిస్థితి సర్దుమణిగే అవకాశం లేదనే అంచనాలే ఇప్పుడు కలచివేస్తున్నాయి.
ఇప్పటికే వివిద రాష్ట్రాల్లో అప్పుల భారం ఎక్కువగా కనిపిస్తోంది. బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా పలు చిన్న రాష్ట్రాలకు అలాంటి సమస్యలున్నాయి. తెలంగాణా, మహారాష్ట్ర వంటి ఆర్థిక వనరులున్న రాష్ట్రంలో కూడా ఉద్యోగుల వేతనాలు కోత వేసిన తరుణంలో ఇక ఇతరరాష్ట్రాల పరిస్థితి చెప్పనవసరం లేదని అంతా భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త అప్పులకు కూడా అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. దాంతో ఆర్థిక చిక్కుల్లో బండి నెట్టుకురావడం పెద్ద సమస్యగా మారబోతోంది. ఈ పరిస్థితినే ముఖ్యమంత్రులు పీఎం ముందు ప్రస్తావించారు. కానీ ఆయన మాత్రం స్పందించలేదు. కరోనా కి సంబంధించిన తాజా సమాచారం, కేంద్రం తీసుకుంటున్న జాగ్రత్తలు, లాక్ డౌన్ అమలు చేయడంలో పెట్టాల్సిన శ్రద్ధ గురించి మాత్రమే మోడీ మాట్లాడారు. దాంతో వివిధ రాష్ట్రాల ఆశలు నెరవేరుతాయా లేదా అన్నది అంతుబట్టడం లేదు.
రాష్ట్రాలతో పాటుగా కేంద్రానికి కూడా ఆదాయం పడిపోతున్న తరుణంలో మోడీ ప్రభుత్వం పెద్ద మనసు చాటుకునే అవకాశాలు స్వల్పంగా కనిపిస్తున్నాయి. దాంతో ఎవరికి వారు గట్టెక్కడానికి తగ్గట్టుగా సన్నాహాలు చేసుకోవడం ఉత్తమమనే అంచనాలు ఆయా రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. ఏపీలో కూడా ఆర్డినెన్స్ ద్వారా నిర్ణయించిన రూ.70వేల కోట్ల బడ్జెట్ లో వివిధ రంగాలకు కేటాయింపులు నిలిపివేసి ప్రస్తుతానికి పూర్తిగా కరోనా విషయంపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. పరిస్థితి సర్థుమణిగిన తర్వాత ఇతర అంశాలు చూడవచ్చనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. దాంతో ఈ వ్యవహారం ఎటు మళ్లుతుందోననే పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఆయా రాష్ట్రాలను ఆదుకునేందుకు కేంద్రం ముందుకు వస్తే తప్ప గండం నుంచి గట్టెక్కే అవకాశాలు కనిపించడం లేదు.