అధఃపాతాళంలో క్రూడ్ ఆయిల్ ధరలు- దివాళా బాట లో వందల చమురు ఉత్పత్తి కంపెనీలు
కరోనా పంజా క్రూడ్ ఆయిల్ పై పడింది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా అధఃపాతాళానికి ధరలు పడిపోయాయి. సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ ధరలన్నీ పతనం అయ్యాయి. ఒకానొక దశలో క్రూడ్ ఆయిల్ ధర మైనస్ 37.63 డాలర్ల దిగువకు పడిపోయింది.
దీంతో ఆయిల్ ఉత్పత్తి చేసే కొన్ని వందల కంపెనీలన్నీ దివాళా బాట పట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా దేశాలన్నీ లాక్ డౌన్ విధించడం, వాహనాలు తిరగకపోవడం, ఫ్యాక్టరీలు పని చేయకపోవడం లాంటి కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ వినియోగం పడిపోయింది. ఆయిల్ కంపెనీల ద్వారా ఉత్పత్తి జరుగుతుంది కానీ, వినియోగించే మార్గాలు లేకపోవడంతో క్రూడ్ నిల్వలు పెరుకుపోయాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోయాయి. ఎంతగా అంటే పెట్రోల్ కొన్నందుకు వినియోగదారులకు పెట్రోల్ ఉత్పత్తిదారుడు ఎదురు డబ్బులు ఇచ్చేంత దారుణంగా ధరలు పతనమయ్యాయి. ఈ ధరల పతనం వల్ల కొన్ని వందల క్రూడ్ ఆయిల్ కంపెనీలు దివాళా బాట పట్టాయి.
గతంలో ఇరాన్ మేజర్ జనరల్ ఖాసీం సులేమాని ని అమెరికా దళాలు దాడి చేసి హతమార్చడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా ఎగసిపడింది. ఆ తర్వాత ప్రపంచ ప్రధాన చమురు ఉత్పత్తిదారులయిన,సౌదీఅరేబియా-రష్యాల మధ్య ధరల యుద్ధం జరగడంతో చమురు ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఆ తరువాత చమురు ధరలు కుప్పకూలకుండా పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) పది రోజుల క్రితం అసాధారణ చర్యలు తీసుకుంది. రోజుకు పది మిలియన్ బ్యారళ్ళ ఉత్పత్తిని తగ్గించుకోవాలని పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. కాగా అప్పటికే నిల్వలు పేరుకుపోయి ఉండడం, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ వినియోగం దారుణంగా పడిపోవడంతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనం అయ్యాయి.
క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా అధఃపాతాళానికి పడిపోవడంతో దాని ప్రభావం ప్రపంచ షేర్ మార్కెట్లపై పడనుంది. పరోక్షంగా ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలను దెబ్బతీయనుంది. ఇప్పటికే కరోనా ధాటికి ఆర్థికంగా అతలాకుతలం అయిన అగ్రరాజ్యానికి క్రూడ్ ఆయిల్ ధరల పతనంతో కొన్ని వందల అమెరికన్ కంపెనీలు దివాళా బాట పట్టనున్నాయి. ప్రపంచ మార్కెట్లపై చమురు ధరల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని, ఇది ఆర్ధిక మాంద్యానికి దారితీస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు