Idream media
Idream media
ఇరాన్‌లో ప్రజాస్వామ్యం లేదు అంటారు కానీ, అది నిజం కాదు. ఎందుకంటే కరోనాతో అక్కడ ప్రజలే కాదు, నాయకులు కూడా చనిపోయారు. అదే మనదేశంలో ఏం వచ్చినా ప్రజలే చనిపోతారు. నాయకులు Safe గా ఉంటారు. నా చిన్నప్పుడు కరోనా బ్రాండ్‌తో చెప్పుల షాపులుండేవి. అవి ఇప్పుడు ఉంటే దివాళా తీసేవి.
మా ఇంటికాడ ఇడ్లీల బండివాడు దిగులు పడుతున్నాడు. ఎక్కడో చైనాలో ఏదో వస్తే ఇక్కడ బిజినెస్ ఎందుకు పడిపోయిందని ప్రశ్న. చైనా వాడు ఏమిచ్చినా చేతులు కట్టుకుని తీసుకోవలసిందే. ఫస్ట్ చికెన్ మంచూరియా ఇచ్చాడు. తర్వాత ఫోన్లు, బొమ్మలు ఇచ్చాడు. ఇప్పుడు కరోనా ఇస్తున్నాడు. నిన్న ఒక పేపర్‌లో ఒక పెద్దాయన ఎడిట్ పేజీ వ్యాసం రాశాడు. ప్రపంచాన్ని నాశనం చేయడానికి కరోనా పేషెంట్లను చైనా పనికట్టుకుని ప్రపంచమంతా పంపుతూ ఉందట. మెదడు దొబ్బడం అంటే ఇదే. రాసేవాడికి లేకపోతే వేసే వాడికైనా బుద్ధి ఉండాలి కదా!
హైద్రాబాద్‌లో కరోనా భయమని, అనంతపురానికి బస్సు ఎక్కాను. కూచున్నప్పటి నుంచి ఎవడో ఒకడు తుమ్మడం, దగ్గడం. నాకేమో ముక్కు దురద పెడుతోంది. కళ్లు, ముక్కు నులుము కోవద్దని మోడీనే చెబుతున్నాడు. ఆయన గతంలో నోట్లు రద్దు చేసి, ఇకపై కష్టాలను కూడా రద్దు చేస్తానన్నాడు. కొత్త నోట్లతో పాటు కొత్త కష్టాలు కూడా వచ్చాయి.
దురదని ఆపడం వల్ల ముక్కుకి కోపం వచ్చి తుమ్మడం ప్రారంభించింది. నా పక్క సీటు వాడు ఉలిక్కిపడి ఒకటికి రెండు మాస్క్‌లు బిగించాడు. అనంతపురానికి రాగానే మాస్క్‌లు లేని పట్టణానికి వచ్చామని సంతోషించాను. ఒక మిత్రుడు కలిసి నెత్తిన పిడుగేశాడు. కియా ఉద్యోగులంతా సగం మంది అనంతపురం నుంచే ఉద్యోగాలకు వెళతారట. కార్లు తయారు చేసినా చేయకపోయినా వాళ్లు విమానాల్లో కొరియా , చైనా తరచూ వెళుతూ ఉంటారట. కాబట్టి కొరియా వాళ్లలో ఎవడో ఒకడికి కరోనా వచ్చే ఉంటుంది. కాబట్టి అనంతపురం కూడా సేఫ్ కాదన్నాడు. పూర్ ఫెలో వాడికేం తెలుసు. రాయలసీమ వాళ్లకి అంత సులభంగా ఏదీ రాదు. తరతరాలుగా కరువుల్ని , రాజకీయ నాయకుల్ని భరించి కూడా వాళ్లు బతికే ఉన్నారు.
ఇది ఇలా ఉంటే మా అబ్బాయి ఫోన్ చేశాడు. అమెరికాకి టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయి, వస్తారా అని. వస్తాం సరే, అమెరికా వాళ్లు మూర్కులు, భయస్తులు. మేము విమానం దిగగానే కాళ్లు, చేతులు కట్టేసి ఐసోలేషన్ వార్డులో ఆరు నెలలు ఉంచితే ఏమి చేయాలి? టికెట్ కొనుక్కొని జైలుకు పోయినట్టుంటుంది.
మనవాళ్లు అన్ని చర్యలు తీసుకున్నామని పేపర్లలో చెబుతూ ఉంటారు. కరోనా రోగికి కూడా వన్, టూలు వస్తాయని మరిచిపోతారు. టాయ్‌లెట్ లేని ఐసోలేషన్ వార్డు రెడీ చేశారు. రోగి టాయ్‌లెట్ కోసం బయటికి వస్తే మామూలు రోగులు కిటికీల్లోంచి దూకి మరీ పారిపోతున్నారట.
మా హిందీ అయ్యవారు కామ్ కరోనా అంటూ ఉండేవాడు. దానివల్ల ఇప్పుడేం ప్రయోజనం లేదు. కామ్‌గా ఉంటే దాన్ని కరోనా అని ఎందుకంటారు? పేరు మార్చినా దాన్ని కోవిడ్ అని ఎవరూ అనడం లేదు. లిబర్టీ థియేటర్ కాలంలో కలిసిపోయిన దాన్ని మనం లిబర్టీ సర్కిల్ అనే అంటాం. ఇదే అంతే!