iDreamPost
android-app
ios-app

రాజస్థాన్‌ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు సీట్లు గెలుచుకుంటుంది-సచిన్ పైలెట్

రాజస్థాన్‌ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు సీట్లు గెలుచుకుంటుంది-సచిన్ పైలెట్

రాజ్యసభ ఎన్నికల వేళ రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి అగ్రనాయకత్వం భారీ స్థాయిలో కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.జ్యోతిరాదిత్య సింధియా భాటలోనే రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ నడవనున్నాడని ఊహాగానాలు షికారు చేస్తున్న సమయంలో రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయంపై విశ్వాసాన్ని ప్రకటించి రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాడు.

జూన్ 19 న రాష్ట్రంలోని మూడు రాజ్యసభ స్థానాలకు జరగబోయే రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఇద్దరు అభ్యర్థులు విజయం సాధిస్తారని రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ధీమా వ్యక్తం చేశారు.బిజెపి రెండో సీటు గెలిచే అవకాశాలు లేవని నొక్కి వక్కాణించారు. రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బిజెపి ప్రయత్నాలు చేసిందని ఆరోపించిన మరుసటి రోజు ఆయన ఈ ప్రకటన చెయ్యడం విశేషంగా చెప్పవచ్చు.

బిజెపి నాయకులు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల హార్స్ ట్రేడింగ్ కోసం ఒక్కొక్కరికి 25 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం జరిగిన తమ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆరోపించారు.

మా ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులు విజయం సాధించడానికి అవసరమైన సంఖ్యాబలం ఉందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా పైలట్ అన్నారు.మా ఎమ్మెల్యేలు,స్వతంత్రులు మరియు ఇతర పార్టీల మద్దతు తమ అభ్యర్థులకు ఉందని పైలట్ స్పష్టం చేశారు.ఇంతకుముందు రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని,ఇప్పుడు కూడా మా అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికలలో విజయం సాధిస్తారని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాలలో ముఖ్యంగా గుజరాత్‌లో కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సమావేశం కోసం రిసార్ట్‌కు ఆయన పిలిచారు. బిజెపి నేతలు తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉండి పార్టీ పట్ల నిజాయితీతో ఉన్నారని పైలెట్ ప్రకటించాడు.

అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మహేష్ జోషి కూడా మూడు సీట్లలో రెండు ఖచ్చితంగా గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు.మేము బిజెపి ప్రణాళికను విజయవంతం కానివ్వము,మేము హార్స్ రైడింగ్ లేదా అవినీతిని అనుమతించము, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉన్నారని మహేష్ జోషి తెలిపారు.ఇంకా పార్టీ ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని చీఫ్‌ విప్‌ మహేశ్‌ జోషి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డీజీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.

బుధవారం జరిగిన సమావేశంలో 107 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారని, రాష్ట్రంలో పరిస్థితి సంతృప్తికరంగా ఉన్నట్లు మరో కాంగ్రెస్ పార్టీ నాయకుడు వివేక్ బన్సాల్ తెలిపాడు.గురువారం సాయంత్రం మరో సమావేశంను నిర్వహిస్తామని,అందులో రాజ్యసభ అభ్యర్థులు,ఎఐసిసి ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండే పాల్గొంటారని ఆయన వెల్లడించారు.

జూన్ 19 న జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ కెసి వేణుగోపాల్, నీరజ్ డాంగిలను ఎంపిక చేయగా, బిజెపి రాజేంద్ర గెహ్లోట్, ఓంకర్ సింగ్ లఖవత్‌లను పోటీకి దింపింది.రాజస్థాన్‌ అసెంబ్లీలో 200 స్థానాలు ఉండగా కాంగ్రెస్‌కు 107 మంది ఎమ్మెల్యేలతో పాటు మరో 12 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు గెహ్లాట్‌ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు.ఇక ప్రతిపక్ష బిజెపి సొంత బలం 72 మంది కాగా,భాగస్వామ్య పక్షాలు,ఓ ఇండిపెండెంట్‌తో సహా మరో ఆరుగురి మద్దతు ఉంది.ప్రస్తుత బలాబలాల ప్రకారం రెండు స్థానాలు కాంగ్రెస్‌, బిజెపి ఒక స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది.

ఒక్కొక్క రాజ్యసభ అభ్యర్థి గెలుపుకు 51 తొలి ప్రాధాన్యతా ఓట్లు అవసరం కాగా బిజెపికి రెండో అభ్యర్థి గెలుపుకు సరిపడా ఎమ్మెల్యేల మద్దతు లేకపోయినప్పటికీ పోటీకి దిగింది.దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు కోసం బేరసారాలకు ఆస్కారం ఏర్పడింది.కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్న 12 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలతోపాటు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కూడా బిజెపి కన్నేసింది.గుజరాత్ పరిణామాలతో ముందుగానే మేలుకొన్న కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలు,12 మందిని ఇండిపెండెంట్‌లను జైపూర్‌లోని ఓ రిసార్ట్‌కు తరలించి జాగ్రత్త పడింది.