Idream media
Idream media
కరోనా మహమ్మారి బారిన పడుతున్న పొలిటికల్ నేతల లిస్ట్ పెరుగుతూ వస్తోంది. రాజకీయ నేతల్ని ఉలిక్కి పడేలా చేస్తోంది. తమిళనాడు లో డిఎంకె పార్టీకి చెందిన ఎమ్మెల్యే కరోనాతో మృతి.., బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాకు పాజిటివ్ రావడంతో మొదలు పెడితే… ఎక్కడో చోట.. ఎవరో నేత కరోనా బారిన పడుతూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులను కూడా ఈ కరోనా వదలడం లేదు. మంత్రుల, పలువురు ఎమ్మేల్యేల కుటుంబాల్లోనూ కరోనా కలకలం సృష్టించింది. కర్నూలు, గుంటూరు జిల్లాలకు చెందిన రాజకీయ నేతల కుటుంబాల్లోనూ వైరస్ అలజడి రేపింది.
ఇక తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు కూడా కరోనా ఫీవర్ తో ఒణుకుతున్నారు. మొట్ట మొదటిగా మాజీ ఎమ్మేల్యే, బీజేపీ సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి కరోనా బారిన పడ్డారు. తెలంగాణలోని అధికార పార్టీ నేతలను కూడా వైరస్ పట్టి పీడిస్తోంది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, జనగామఎమ్మెల్యే ముతిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. మంత్రి హరీష్ హోమ్ క్వారంటైన్ కే పరిమితం అయ్యారు. నిన్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సిం గ్ గన్ మెన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాజా సింగ్ కూడా పరీక్షలు చేయించు కోనున్నారు. ప్రస్తుతానికి హోమ్ క్వారన్ టైన్లో ఉన్నారు.
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కు కరోనా పాజీటివ్ అని తేలింది. ఈ నెల 19న రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా… ఆయన పేదలకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కొంచెం నీరసంగా ఉండడంతో… ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు అనుమానంతో పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
ఈ మధ్య కాలంలోనే ఆ పార్టీ మరో నేత గూడూరు నారాయణ రెడ్డి కూడా మహమ్మారి బారిన పడ్డారు. వీహెచ్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన ఎవరెవరిని కలిశారు.. అన్న వివరాలను అధికారులు తెలుసుకుంటున్నారు. అనుమానితులను పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్నారు. ఏదేమైనా కరోనా… రాజకీయ వర్గాలను కూడా కుదిపేస్తోంది. క్షేత్ర స్థాయిలో కూడా విజృంభిస్తోంది. ఎక్కడ తమను కాటు వేస్తుంది అని ప్రముఖులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.