iDreamPost
android-app
ios-app

బెంగళూరు ప్రజలకు సిఎం యడ్యూరప్ప వార్నింగ్

బెంగళూరు ప్రజలకు సిఎం యడ్యూరప్ప వార్నింగ్

కర్ణాటకలో రోజురోజుకి కరోనా వైరస్ కేసులు‌ పెరుగుతుండటంతో కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప బెంగళూరు వాసులను గురువారం హెచ్చరించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారా? లేదా మరోసారి లాక్‌డౌన్‌ విధించమంటారా? అని ప్రజలపై ఆసహనం వ్యక్తం చేశారు. 

తిరిగి లాక్‌డౌన్‌ విధించకుండా ఉండాలంటే తప్పసరిగా భౌతిక దూరంతో పాటు, వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఆయన ప్రజలను కోరారు. కరోనా నివారణ చర్యలపై చర్చించేందుకు అధికారులతో యడ్యూరప్ప సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలో బెంగళూరు కూడా ఒకటి.

వివాదాస్పదంగా కర్ణాటక నిర్ణయం

రాష్ట్రంలో కరోనా వైరస్‌ కోరలు చాస్తున్న నేపథ్యంలో ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అంతేగాక విధి నిర్వాహణలో రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు సైతం ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీంతో వారికి ప్రత్యేకంగా బెంగళూరులోని కుమార కృపా 100 పడకల లగ్జరీ ప్రభుత్వ గెస్ట్ హౌస్‌ను కోవిడ్-19 సంరక్షణ కేంద్రం కోసం కేటాయిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. 

ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే రిజ్వాన్‌ అర్షద్‌ స్పందిస్తూ.. ‘’రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అర్థం కావడం లేదు. చివరికి ప్రభుత్వ గెస్ట్‌హౌజ్‌ను విఐపిల కోసం చికిత్స కేంద్రంగా మార్చే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చింది’’ అని మండిపడ్డారు. 

బిజెపి నేత ఉమెస్‌ జాదవ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ‌‘‘ప్రస్తుత పరిస్థితుల్లో క్వారంటైన్‌ చాలా అవసరం. కరోనా బాధితుల కోసం రాష్ట్రంలో వసతి గృహాలు లేనందున ప్రభుత్వం ఏవీ అందుబాటులో ఉంటే వాటిని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాలి’’ అని పిలుపునిచ్చారు. 

కాగా కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న సమీక్షలు, సమావేశాలకు హాజరవుతున్న సీనియర్‌ అధికారులు, మంత్రులు, ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారని, అందువల్ల వారి కోసం ప్రత్యేకమైన కోవిడ్‌ సెంటర్లు అవసరమని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా ఏడు అంతస్తుల కుమార కృపా గెస్ట్‌హౌజ్‌లో ప్రత్యేకంగా 3 అంతస్తులను సుప్రీం కోర్టు న్యామూర్తులు, మంత్రులు, వివిఐపిల కోసం కేటాయించారు. 

20 రోజులు లాక్‌డౌన్‌ విధించాలి

కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. వైరస్‌ కట్టడి కోసం యడ్యూరప్ప సర్కారు మరోసారి లాక్‌డౌన్ ప్రకటించింది. బెంగళూరులోని ఐదు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు తెలిపింది. అయితే కర్ణాటక సర్కారు తీసుకున్న నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి, జెడిఎస్ నేత కుమార స్వామి స్పందించారు.

కేవలం ఐదు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తే ప్రయోజనం ఉండదని.. బెంగళూరు మొత్తం 20 రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. లాక్‌డౌన్‌ అమలులో కఠినంగా వ్యవహరించకపోతే.. బెంగళూరు మరో బ్రెజిల్ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ కంటే ప్రజల జీవితాలు చాలా ముఖ్యమైనవి పేర్కొన్నారు.

ప్రస్తుత సమయంలో కార్మికులకు నిత్యావసర సరుకులతో పాటు‌రూ.5వేల ఇవ్వాలని కుమారస్వామి కర్ణాటక సర్కారును విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ వారికి ఏమాత్రం సరిపోదన్నారు. కార్మికులకు అవసరమైన సాయాన్ని వెంటనే అందించాలని కుమార స్వామి కోరారు. పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత డికె శివ కుమార్ నియోజకవర్గంలో ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు.