Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ రోజు ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. నెల రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యం నిర్ధేశించారు. మద్యం, నగదు పంపిణీ జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.
కొత్తగా తెచ్చిన నిబంధనల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేశారని తేలితే గెలిచిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తారు. అంతే కాదు రెండేళ్లు జైలు శిక్ష పడుతుంది. గత మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు. లోకల్ ఎన్నికల్లో ఈ నిబంధనలు పటిష్టంగా అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలవాలని సీఎం జగన్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు.
రిజర్వేషన్లపై సుప్రింకు వెళ్లాని టీడీపీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. నెల రోజుల్లోపు ఎన్నికలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించడంతో.. రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం శిరసావహించినట్లే. నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహించేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు. 50 శాతం రిజర్వేషన్లకు అనుగుణంగా ఇప్పటికే ఖరారు చేసిన రిజర్వేషన్లలో మార్పులు చేస్తున్నారు. రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎప్పుడు నోటిపికేషన్ వస్తుందనే విషయం తేలే అవకాశం ఉంది.