iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో వివిధ కొత్త పథకాల ద్వారా దేశం దృష్టిని ఆకర్షిస్తున్న జగన్ విన్నూత్న నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. పాలనా పరమైన మార్పులతో ముందడుగు వేస్తున్నారు. తాజాగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా కీలక అడుగు వేశారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ ( ఏపీఈఎంసీ) ఫ్లాట్‌ఫాంని సీఎం జగన్ ప్రారంభించారు.
ఇప్పటికే పలు పరిశ్రమల విషయంలో జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజల భద్రత ధ్యేయంగా నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా ఎల్జీ పాలిమర్స్ విషయంలో జగన్ ప్రభుత్వం నిర్ణయం అందరినీ ఆకర్షించింది. నష్టపరిహారం ప్రకటనలోనూ, దానిని చెల్లించడంలోనూ, బాధితులకు భరోసాగా నిలిచేందుకు యంత్రాంగం చేసిన ప్రయత్నాల ద్వారానూ ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరిగింది.
అదే పరంపరలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్ లైన్ వేస్ట్ ఎక్చేంజ్ ఫ్లాట్ ఫాం ప్రయోజనకరంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం ఈ వేదికను ఏర్పాటు చేసింది. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల నిర్వహణ బాధ్యతలను ఏపీఈఎంసీ తీసుకుంటుంది. పర్యావరణ నియమాలు, నిబంధనలను కచ్చితంగా అమలు జరిగేలా చూస్తుంది. అందుకోసం ఏర్పాటు చేసిన వేస్ట్ ఎక్చేంజ్ ఫ్లాట్ ఫాం ఎంతో తోడ్పడుతుందని యంత్రాంగం చెబుతోంది.
వ్యర్థాల నిర్వహణలో కచ్చితమైన ట్రాకింగ్, స్క్రూట్నీ, ఆడిటింగ్ ప్రక్రియలు నిర్వహించేందుకు ఏపీ ఈఎంసీ ఉపయోగపడుతుందని సీఎం జగన్ అన్నారు. వ్యర్థాలను ప్రాసెస్ చేసే విధానాలకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. పరిశ్రమల యజమానులు దాని మీద శ్రద్ధపెట్టాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఏపీలో పర్యావరణం కాపాడుకుంటూ ఉపాధి పెంచే రీతిలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గౌతం రెడ్డి, పిల్లిసుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, స్పెషల్ చీఫ్‌సెక్రటరీ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ నీరబ్‌కుమార్ ప్రసాద్, ఏపీపీసీబి మెంబర్ సెక్రటరీ వివేక్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.