ఉద్యోగార్థులకు శుభవార్త.. 26 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్‌ హామీ

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.45 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, వలంటీర్‌ వ్యవస్థ ద్వారా 2.70 లక్షల మందికి ఉపాధి కల్పించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మరో భారీ ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చారు. ఈ సారి పోలీస్‌ విభాగంపై సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. రాబోయే నాలుగేళ్లలో ఏడాదికి 6,500 ఉద్యోగాల చొప్పన 26వేల ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్‌ ఈ హామీ ఇచ్చారు.

పోలీసు శాఖ సరిపడనంత సిబ్బంది లేమితో సతమతమవుతోంది. ఉన్న సిబ్బందిపై పని భారం ఎక్కువగా పడుతోంది. ఈ క్రమంలో వారు అనారోగ్యానికి గురవుతున్నారు. కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన సీఎం వైఎస్‌ జగన్‌.. పోలీసులకు కూడా వీక్లీ ఆఫ్‌ ఇవ్వాలని నిర్ణయించారు. గత ఏడాది నుంచి అమలు చేస్తున్నారు. ఈ అంశాలంన్నింటినీ పరిగణలోకి తీసుకుని సిబ్బందిని భర్తీ చేయాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది.

పోలీసు విభాగంలో ఉద్యోగం చేయాలని లక్షల మంది కలల కంటారు. యూనీఫాం ఉద్యోగం కావడమే ఇందుకు కారణం. ఇందు కోసం కోచింగ్‌ తీసుకుని నోటిఫికేషన్‌ ఎప్పుడు వేస్తారా..? అని ఎదురుచూస్తుంటారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఎప్పుడు వేస్తారనేది ప్రభుత్వ పెద్దల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆ విభాగం ఉన్నతాధికారులకు కూడా ఈ విషయం తెలియదంటే అతిశయోక్తి కాదు.

ఈ విధానానికి సీఎం వైఎస్‌ జగన్‌ చెక్‌ పెట్టారు. నిర్ణీత సమయంలో ఉద్యోగాలు భర్తీ చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం హామీ ఇచ్చిన పోలీసు ఉద్యోగాల భర్తీకి కూడా నిర్ణీత సమయం చెప్పారు. ప్రతి ఏడాది డిసెంబర్‌లో ఖాళీల భర్తీ గుర్తించి.. జనవరిలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని సీఎం జగన్‌ స్పష్టంగా చెప్పారు.

Show comments