Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా పిలుస్తున్న పోలవరం ప్రాజెక్టుపై సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తన మనసులోని ఆలోచనలను ఈ రోజు ‘మన పాలన – మీ సూచన’ కార్యక్రమంలో పంచుకున్నారు. వ్యవసాయం – ప్రాజెక్టులు అంశంపై ఈ రోజు సదస్సు జరిగింది. పోలవరం పూర్తి చేయడమే కాకుండా.. పోలవరం కుడి కాలువ వెడల్పును కూడా పెంచుతామని సీఎం జగన్ ప్రకటించారు. ప్రస్తుతం పోలవరం కుడికాలువ సామర్థ్యం 17,500 క్యూసెక్కుల నుంచి 50 వేల క్యూసెక్కులకు పెంచుతామని సీఎం జగన్ వెల్లడించారు. అందులో కృష్ణా డెల్టాకు 25 వేల క్యూసెక్కుల సరిపోగా.. మిగతా నీటిని శ్రీశైలంలో ఆపి రాయలసీమకు తరలిస్తామని పేర్కొన్నారు.
ఈ ఏడాదిలో ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీశామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. రివర్స్ టెండర్ల ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టుల్లోనే 1095 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఆదా చేశామని చెప్పారు. రివర్స్ టెండర్లు పిలవకపోతే ఆ సొమ్ము రాజకీయ నేతల జేబుల్లోకి వెళ్లేవన్నారు. పూర్తి పారదర్శకతతో ప్రాజెక్టుల టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశామని చెప్పారు. వ్యవసాయం చేయాలంటే నీరే ప్రధాన వనరు అని సీఎం నొక్కి చెప్పారు.
రాయలసీమ కరువును తరిమికొట్టేందుకు చేపట్టే ప్రాజెక్టులపై కుట్రలు జరుగుతున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇటీవల ప్రాజెక్టులపై జరుగుతున్న దుష్ప్రచారం చూస్తూనే ఉన్నామన్నారు. పోరాటం కరువుపైనే కాదని, చంద్రబాబు, ఈనాడు, టీవీ 5, కుళ్లిపోయిన రాజకీయాలతో కూడా చేస్తున్నామని చెప్పారు. శ్రీశైలంలో 881 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు నీరు తీసుకోవాలంటే సీమ ప్రాజెక్టులు ఎప్పుడు నిండుతాయని సీఎం జగన్ అన్నారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం జగన్ తెలిపారు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తనికీ తర్వాత ప్రభుత్వ ముద్రతో రైతులకు అందిస్తామని చెప్పారు. అన్నదాతలు ఎరువులు, పరుగుమందుల కోసం ఎక్కడకీ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. రైతు ఉత్పత్తులను రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. ఈ క్రాప్ బుకింగ్ ద్వారా మార్కెటింగ్, మద్ధతు ధర, రూపాయికే ఇన్యూరెన్స్‌లను అందిస్తామని చెప్పారు. రైతులకు ఎంత చేసినా తక్కువనేన్నారు. ఇంకా రైతులకు ఏమి చేయగలమో చెప్పాలని సీఎం జగన్ కోరారు. అధికారులు, రైతుల నుంచి సలహాలు తీసుకున్నారు.