iDreamPost
android-app
ios-app

గవర్నర్‌ను కలసిన సీఎం జగన్‌.. త్వరలో కొత్త మంత్రులను చూడబోతున్నామా..?

గవర్నర్‌ను కలసిన సీఎం జగన్‌.. త్వరలో కొత్త మంత్రులను చూడబోతున్నామా..?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ రోజు సాయంత్రం గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ను కలిశారు. గవర్నర్‌తో సీఎం భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కరోనా వైరస్‌ కట్టడిపై తీసుకుంటున్న చర్యలు, తాజా రాజకీయ పరిణామాలను సీఎం జగన్‌.. గవర్నర్‌కు వివరించినట్లు తెలుస్తోంది.

అయితే సీఎం జగన్‌ గవర్నర్‌ను కలవడంతో రాజకీయవర్గాల్లో ఓ చర్చ ప్రారంభమైంది. ఈ నెల 19న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. మత్య్స, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపీదేవి వెంకటరమణ, ఉప ముఖ్యమంత్రి హోదాలో రెవెన్యూ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌లను సీఎం జగన్‌ రాజ్యసభకు పంపారు. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా రేపల్లె, తూర్పు గోదావరి జిల్లా మండపేట నుంచి మోపీదేవి, పిల్లిసుభాష్‌లు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే పార్టీ ప్రారంభం నుంచి అండగా ఉన్న వారిద్దరినీ ఎమ్మెల్సీలు చేసిన సీఎం జగన్‌ తన కేబినెట్‌లోకి తీసుకున్నారు.

కాగా, ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలని వైసీపీప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించింది. పార్లమెంట్‌ ఆమోదమే తరువాయి మండలి రద్దు కానుంది. ఈ నేపథ్యంలో మోపీదేవి, పిల్లి సుభాష్‌లు తమ పదవులను కోల్పోనుండడంతో వారిద్దరినీ రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. ఏపీలో ఖాళీ అయిన నాలుగు సీట్లలో రెండు సీట్లు వీరద్దిరికీ ఇచ్చారు. ఈ నెల 19న జరిగిన ఎన్నికల్లో వీరు ఎన్నికయ్యారు.

మోపీదేవి, పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌లు రాజ్యసభకు ఎన్నిక కావడంతో రెండు మంత్రి పదవులు ఖాళీ అవుతున్నాయి. వీటిని భర్తీ చేయాల్సిన సమయం వచ్చింది. వారిద్దరి స్థానాల్లో ఎవరిని నియమిస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. మోపీదేవీ వెంకటరమణ మత్య్సకార సామాజికవర్గం, పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌ శెట్టిబలిజ సమాజికవర్గం కావడంతో.. వారి స్థానాల్లో తిరిగా ఆయా సామాజిక వర్గాల వారికే అవకాశం కల్పిస్తారా..? లేదా బీసీల్లోనే ఇతర సామాజికవర్గాల వారికి ఇస్తారా..? అనే చర్చ సాగుతోంది. కేబినెట్‌లో రెండు బెర్త్‌లు ఖాళీ అవడంతో ఆశానువాహులు జాబితా పెద్దదిగానే ఉంది. ఈ క్రమంలో సీఎం జగన్‌ గవర్నర్‌తో సమావేశం కావడంతో త్వరలో ఇద్దరు మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందనే చర్చ మొదలైంది.