iDreamPost
android-app
ios-app

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. సీఎం జగన్‌ కీలక ప్రకటన

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. సీఎం జగన్‌ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభవార్త చెప్పారు. వైద్యంపై పూర్తి భరోసా ఇస్తూ కీలక ప్రకటన చేశారు. మెనిఫెస్టో పెట్టిన విధంగా వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తామన్న మేరకు ఇప్పటికే పశ్చిమ గోదావరిలో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తుండగా.. దాని పరిధిని మరికొన్ని జిల్లాలకు పెంచడంపై సీఎం జగన్‌ ప్రకటన చేశారు. ఈ మేరకు ఈ రోజు మన పాలన – మీ సూచన కార్యక్రమంలో భాగంగా వెద్య, ఆరోగ్య శాఖపై జరిగిన సదస్సులో సీఎం జగన్‌ ప్రశంగించారు.

తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీ నుంచి వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా మరో ఆరు జిల్లాలకు పథకం పొడిగిస్తామని తెలిపారు. ఆ తర్వాత నవంబర్‌ నాటికి మిగతా ఆరు జిల్లాలను కూడా ఈ పథకం పరిధిలోకి తెస్తామని తెలిపారు. తద్వారా నవంబర్‌ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడి వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని తెలిపారు.

వైఎస్సార్‌ హయాంలో విద్య, వైద్యానికి పెద్దపీట వేశారని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని కుంటుపడేలా చేశాయని సీఎం జగన్‌ పేర్కొన్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్‌ హయాంను తిరిగి తెస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం అర్హతను కూడా పెంచినట్లు చెప్పారు. రేషన్‌కార్డుతోపాటు ఏడాది ఆదాయం 5 లక్షలు ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుంబాలకు మేలు జరుగుతోందన్నారు.

నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. ప్రస్తుతం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూపాయి కూడా బిల్లులు పెండింగ్‌లేవని చెప్పారు. ఉచిత వైద్యం అందించడంతోపాటు ఆపరేషన్‌ తర్వాత విశ్రాంతి సమయంలో ఆర్థిక సహాయం కూడా చేస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి 5 వేల నుంచి 10 వేల రూపాయల వరకూ ప్రతి నెలా పింఛన్‌ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం 9 రకాల వ్యాధులతో బాధపడే వారికి వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. ఏడాది కాలంలోనే ఈ పనులన్నీ చేసినట్లు చెప్పారు.

అర్హులైన 1.42 కోట్ల కుటుంబాలకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ఆరోగ్యశ్రీ కార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కోటికిపై కుటుంబాలకు కార్డులు అందించినట్లు చెప్పారు. మరో రెండు వారాల్లో అందరికీ అందుతాయని చెప్పారు. ఫలితంగా ప్రతి సారి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేకపోవడంతోపాటు.. సదరు వ్యక్తి ఆరోగ్య చరిత్ర వైద్యులకు పూర్తిగా తెలుస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులో మందుల నాణ్యత బాగా పెంచినట్లు చెప్పారు. మందుల లభ్యత పెంచినట్లు చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన మందులనే ప్రభుత్వ ఆస్పత్రులలో అందిస్తున్నట్లు చెప్పారు. తనకు బాగాలేకపోయినా.. ప్రభుత్వ ఆస్పత్రులలో మందులు వాడేలా పరిస్థితులు చక్కదిద్దామని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు.