iDreamPost
iDreamPost
ప్రజా సంక్షేమమే ధ్యేయం గా పాలన సాగిస్తున్న సి.యం జగన్ తాను పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు కసరత్తు ప్రారంభించారు. పాదయాత్ర సందర్భంగా జగన్ ను కలిసిన మత్స్యకారులు రాష్ట్రంలో ఉన్న 9 తీరప్రాంత జిల్లాలో జట్టీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పుడు వారి కోరిక మేరకు సుమారు 2,901.61 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 తీరప్రాంత జిల్లాలో ఫిషింగ్ హార్బర్లు నిర్మించేందుకు జగన్ ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చెసింది.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సి.యం జగన్ నిర్వహించిన మౌళిక సదుపాయాలు, పెట్టుబడులపై సమీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశల్లో హార్బర్ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. అంతే కాకుండా సీఎం జగన్ మత్స్యకారుల సంక్షేమం పై పలు కీలక సూచనలు చేశారు. వేట కోసం మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఫిషింగ్ హార్బర్లను పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, కృష్ణా జిల్లా మచిలీపట్నం, గుంటూరు జిల్లా నిజాంపట్నంలో ఫేజ్ –2 హార్బర్, నెల్లూరు జిల్లా జువ్వల దిన్నెలో మొదటి విడత కింద రూ.1,304 కోట్లతో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. రెండో విడతలో ప్రకాశం జిల్లా వాడ్రేవు , కోత్తపట్నం, శ్రీకాకుళం జిల్లా బూదగట్ల పాలేం, ఎడ్డువానిపాలేం, విశాఖ జిల్లాతో కలిపి మోత్తం 5 చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టనున్నారు.
కొత్త హార్బర్ల నిర్మాణంతో పాటు పాత హార్బర్ల ఆధునికీకరణ, డీప్ సీ ఫిషింగ్ కోసం తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మత్య్సకారుల జీవన ప్రమాణాలు పెంచడంతోపాటు వేట కోసం అత్యాదునిక పద్ధతులు అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రకాశం జిల్లాలో విమానాశ్రయం నిర్మాణానికి ప్రతిపాదనలు వీలైనంత త్వరగా సిద్దం చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తన ప్రభుత్వం ఏర్పడగానే మత్స్యకారులను అనేక విదాలుగా ఆదుకున్న విషయం తెలిసిందే. ఒక్కో మర పడవకు నెలకు రూ.27 వేలు, ఇంజను కలిగిన తెప్పలకు రూ.2,700 చొప్పున డీజిల్ పై రాయితీ ఇస్తున్నారు. గత ప్రభుత్వం లీటర్ డీజిల్‌కు ఇచ్చే రూ.6.03 రాయితీ ఇప్పుడు రూ.తొమ్మిదికి పెంచారు. వేట కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించే మృతుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను కూడా రూ.ఐదు లక్షల నుంచి రూ.పది లక్షలకు పెంచారు. వేట నిషేధ సమయంలో గత ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు భృతినివ్వగా దాన్ని రూ.పది వేలకు పెంచారు. ఇప్పుడు 9 తీరప్రాంత జిల్లాలో ఫిషింగ్ హార్బర్లు నిర్మించేందుకు రంగం సిద్దం చేయడంతో రాబొయే రోజుల్లో ఇక వేటకోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళి పాకిస్తాన్, శ్రీలంక , బంగ్లాదేశ్ జైళ్లలో మగ్గవలసిన దుస్థితి నుంచి మత్యకారులకు విముక్తి కలుగనుంది.