ఓవర్‌ టు ఢిల్లీ..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన ఢిల్లీ పర్యటనను ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితం తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయనతో పలువురు వైసీపీ ఎంపీలు, ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సీఎం జగన్‌ భేటీ కాబోతున్నారు.

విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులు తదితర అంశాలపై సీఎం వైఎస్‌ జగన్‌ అమిత్‌ షాతో చర్చించే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం ఇంకా పెండిగ్‌లోనే ఉంది. ఈ విషయం కూడా వారిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

అమరావతి ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌లో సుప్రిం సీనియర్‌ జడ్జి ఎన్‌వీ రమణకు ఉన్న సంబంధాలపై సీఎం వైఎస్‌ జగన్‌ సుప్రిం సీజేకు పోయిన సారి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయం సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం మీడియాకు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకూ ఈ విషయంపై సుప్రిం సీజే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం జగన్‌ ఢిల్లీలో పర్యటించబోతుండడం అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది.

Show comments