కరోనా ఎఫెక్ట్-సీఆర్‌పీఎఫ్ హెడ్‌క్వార్టర్స్ భవనం మూసివేత

  • Published - 08:25 AM, Sun - 3 May 20
కరోనా ఎఫెక్ట్-సీఆర్‌పీఎఫ్ హెడ్‌క్వార్టర్స్ భవనం మూసివేత

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దాదాపు 40 వేలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో లాక్ డౌన్ మే 17 వరకూ పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. కాగా తాజాగా కరోనా సెగ సీఆర్పీఎఫ్ కు తాకింది.

సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా సోకుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్ హెడ్‌క్వార్టర్స్ భవనం మూసివేశారు. ఇప్పటికే సీఆర్‌పీఎఫ్ అధికారితో పాటు 122 మంది జవాన్లకు కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. కరోనా వైరస్ సోకిన జవాన్లు 31 వ బెటాలియన్ కు చెందినవారు కావడం గమనార్హం. ప్రస్తుతం పాజిటివ్‌గా తేలిన ఉద్యోగితో కాంటాక్ట్ అయినవారిని గుర్తిస్తున్నామని అధికారులు తెలిపారు. డీఐజీ, స్పెషల్ డెరెక్టరేట్ జనరల్ సహా మొత్తం 40 మంది అధికారులు, సిబ్బందిని హోం క్వారంటైన్ చేయనున్నారు. 

దీంతో జాగ్రత్త చర్యలు చేపట్టి సీఆర్‌పీఎఫ్ హెడ్‌క్వార్టర్స్ భవనం మూసివేశారు. భవనాన్ని శుభ్రం చేసి శానిటైజైషన్ ప్రక్రియ ప్రారంభించారు. పూర్తిగా భవనాన్ని శుభ్రపరిచిన తర్వాత తిరిగి తెరుస్తారు.

కాగా ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా  కరోనా 39,980 పాజిటివ్‌ కేసులు నమోదవగా 1301 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 10,633 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 

Show comments