Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ శాసన సభ, శాసన మండలి సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. సభలోపల సభ్యులు ఆరోపణలు, విమర్శలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. బయట వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యర్తలు సోషల్ మీడియా వేదికగా తమ పోరు కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా చేసిన పని ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతోంది. ఎమ్మెల్యే రోజాపై విమర్శలకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
నిన్న శాసన మండలి సమావేశాలు జరుగుతున్న సమయంలో వీక్షకుల లాబీలో ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ, రోజా సెల్పీ తీసుకున్నారు. రోజానే ఈ సెల్ఫీ తీయడం విశేషం. వారి పక్కనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఉండడం ఇక్కడ విశేషం. తాజా పరిణామంతో గతంలో బాలకృష్ణ, రోజా హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రాలను వారి అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. భైరవదీపం, పెద్దన్నయ్య వంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాల్లో రోజా, బాలయ్య జంటగా నటించారు.
సినీ హీరోయిన్‌గా ఉన్న రోజా శెల్వమణి తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయారంగేట్రం చేశారు. తెలుగు మహిళా అధ్యక్షురాలుగా కీలక ప్రాత పోషించారు. అయితే తదనంతరం పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్‌తో నడుస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా చిత్తూరు జిల్లా నగరి నుంచి గెలిచారు. అదే సమయంలో బాలయ్య కూడా అనంతపురం జిల్లా హిందూపురం నుంచి శాసన సభకు ఎన్నికయ్యారు. సినిమాల్లో విజయవంతమైన జోడీగా పేరొందిన బాలకృష్ణ, రోజా లు.. ఇటు రాజకీయాల్లో కూడా విజయవంతమయ్యారని చెప్పవచ్చు.
ప్రస్తుతం పార్టీలు వేరైనా.. తమ మధ్య ఆ నాటి స్నేహాన్ని గుర్తు చేసేలా.. రోజా.. బాలకృష్ణతో సెల్ఫీ దిగడం చర్చనీయాశమైంది. ఈ ఫోటోలో రోజా, బాలయ్యతోపాటు వైఎస్సార్‌సీపీ దెంతులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కూడా ఉన్నారు. వారిరువురి ఫొటోలో తాను కనిపించేందుకు అబ్బయ్య చౌదరి పడిన తాపత్రాయం తాను ఎమ్మెల్యే అయినా సాధారణ అభిమానినే అనే సందేశం అబ్బయ్య చౌదరి ఇస్తున్నాట్లుగా కనపడుతోంది. చట్ట సభల బయట ఇలా హుందాగా, స్నేహపూర్వకమైన వాతావరణంలో ఉండే నేతలు.. సభల్లో కూడా ఇదే తీరుతో హుందాగా చర్చలు సాగిస్తే ప్రజలు హర్షిస్తారు.