iDreamPost
android-app
ios-app

అచ్చెం నాయుడు అరెస్ట్‌ – ముందస్తు నోటీస్ మీద ఎందుకు ఈ గోల?

అచ్చెం నాయుడు అరెస్ట్‌ – ముందస్తు నోటీస్ మీద ఎందుకు ఈ గోల?

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడును ఈఎస్‌ఐ కుంభకోణంలో ఏసీబీ అరెస్ట్‌ చేయడంతో టీడీపీ నేతలు గగ్గొలు పెడుతున్నారు. అనుకూల మీడియా పదే పదే ప్రసారం చేస్తూ, టీడీపీ తాజా, మాజీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తమ వీక్షకులకు వినిపిస్తోంది. అచ్చెం నాయుడు అరెస్ట్‌ను బీసీలపై దాడిగా ప్రొజెక్ట్‌ చేస్తున్న చంద్రబాబు అండ్‌ టీం.. ఒకే మాటను పదే పదే వల్లె వేస్తున్నారు. ‘ముందస్తు నోటీసు లేకుండా అరెస్ట్‌ చేశారు‘ అంటూ వాపోతున్నారు.

ఈఎస్‌ఐ స్కాంలో ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు క్రాస్‌ చెక్‌ చేసుకున్నట్లు ఏసీబీ అధికారి ఈ రోజు ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మాటలను బట్టి ఆర్థం అవుతోంది. ఈ స్కాంలో విజిలెన్స్‌ విభాగం ఇచ్చిన నివేది కను మరోసారి నిర్థారించుకునేందుకు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్‌ నివేదికను పక్కన పెట్టుకున్న ఏసీబీ అందులోని ప్రతి అంశాన్ని క్రాస్‌ చెక్‌ చేసుకుని, పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే రంగంలోకి దిగేందుకు సిద్ధమైంది. అందుకే నేరుగా సిబ్బంది, పోలీసులతో అచ్చెంనాయుడు ఇంటికి వెళ్లి అరెస్ట్‌ చేసింది.

పక్కా ఆధారాలు ఉండడంతోనే అచ్చెం నాయుడు నోరు మూగబోయింది. ముందుస్తు నోటీసు ఇవ్వకుండా అరెస్ట్‌ ఎలా చేస్తారని టీడీపీ నేతలు అడుగున్న ప్రశ్న.. అచ్చెం నాయుడు అడగకుండా ఉండబోరని ఆయన వ్యవహారశైలిని తెలిసినవారెవరికైనా అర్థం అవుతుంది. ఎదురు ప్రశ్నలు వేసే అవకాశం లేకుండా ఏసీబీ ఈ స్కాంలో అచ్చెంనాయుడు పాత్రపై ఆధారాలు చూపించి ఉంటుంది. అందుకే సైలెంట్‌గా ఏబీసీ అధికారులకు సహకరించారు. ఒకవేళ ఏసీబీ అధికారులు ఆధారాలు చూపించకపోతే… అచ్చెం నాయుడు తన అరెస్ట్‌కు ఏ మాత్రం సహకరించేవారు కాదన్నది సత్యం. తన స్వగ్రామంలో ఉన్న అచ్చెం నాయుడు ఇంటి ముందు భైఠాయించి నానా హంగామా సృష్టించేవారు. స్థాన బలం, భుజ బలం, నోటి బలం ఉన్నా కూడా అచ్చెం నాయుడు మౌన మునిలా ముందుకుసాగిపోవడం వెనుక కుంభకోణంపై పక్కా ఆధారాలు ఉండడమే కారణం కావచ్చు.

చంద్రబాబు అండ్‌ టీం.. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్‌ చేశారంటూ..? బాధపడుతోంది. దీనికి కూడా కారణం ఉందని చంద్రబాబు వ్యవహార శైలిని చూసిన వారు చెబుతున్నారు. ముందస్తు నోటీసు ఇచ్చి ఉంటే.. కోర్టులకు వెళ్లి జయప్రదంగా ముందస్తు బెయిల్‌ తెచ్చుకునేవారు. ఈ పని చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన చరిత్ర చెబుతోంది. తనపై జరిగే విచారణలు, జరగబోయే విచారణలపై స్టేలు, బెయిల్‌లు తెచ్చుకున్న అనుభవం, సత్తా దేశంలో ఏ నాయకుడికి లేనిది చంద్రబాబుకు సొంతం అని తన ఆక్రమాస్తుల కేసుల నుంచి నిన్న ఓటుకు నోటు కేసు వరకూ చూస్తే ఇట్టే తెలుస్తుంది.

ఏదైనా విషయాన్ని విజయవంతంగా పక్కదోవ పట్టించడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు అచ్చెం నాయుడు అరెస్ట్‌ను కూడా అదేబాటలో నడిపించారు. 100 మంది పోలీసులు వెళ్లి అచ్చెం నాయుడును కిడ్నాప్‌ చేశారని ఉదయం మాట్లాడిన చంద్రబాబు ఆ తర్వాత ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్‌ చేశారంటూ కొత్తపల్లవి ఎత్తుకున్నారు. అసలు ముందస్తు నోటీసు ఏ సందర్భంలో ఇస్తారు..? విచారణ జరుగుతున్న సమయంలో సదరు విషయంలో పాత్ర ఉందన్న అనుమానంతో ఎవరికైనా నోటీసులు ఇచ్చి పిలుస్తారు. కానీ ఈఎస్‌ఐ కుంభకోణంలో విచారణ పూర్తయింది. విజిలెన్స్,ఏసీబీ రెండు సంస్థలు అవినీతి జరిగిందని ధృవీకరించాయి. ఆధారాలు పక్కాగా ఉన్నాయి. ఈ విషయంలో ఇక మిగిలింది అరెస్ట్‌లే. అదే ఏసీబీ చేసింది.

ఉదయం నుంచి హంగామా చేస్తున్న చంద్రబాబు అండ్‌ కో అచ్చెం నాయుడును కిడ్నాప్‌ చేశారని, అరెస్ట్‌ చేశారని, బీసీపై దాడి అని, ఆయనకు ఆరోగ్యం బాగోలేదని, సర్జిరీ చేసుకున్నారని చెబుతున్నారు గానీ.. ఈఎస్‌ఐ స్కాం జరగలేదు, అచ్చెం నాయుడు అవినీతికి పాల్పడలేదు.. అందులో ఆయన పాత్ర ఏమీ లేదని మాత్రం చెప్పడంలేదు. ఈఎస్‌ఐ స్కాం జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతనే వెలుగులోకి వచ్చినట్లు, వైసీపీ ప్రభుత్వమే ఈ స్కాంపై విచారణకు ఆదేశించినట్లుగా టీడీపీ నేతలు ప్రొజెక్ట్‌ చేస్తున్నారు. కానీ వాస్తవానికి 2015లోనే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పుడు విజిలెన్స్‌ దర్యాప్తు జరిగింది. విశాఖ భూ కుంభకోణం మాదిరిగానే ఇది కూడా మరుగునపడిపోయింది. అయితే అటు తెలంగాణలో వెలుగులోకి రావడంతో ఏపీలో కూడా కదలిక మొదలైంది. ఈవన్నీ ఏమీ జరగనట్లు.. కొత్తగా జగన్‌ ప్రభుత్వమే ఈ స్కాంను బయటపెట్టి కక్షసాధింపునకు దిగుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు.

ఈ రోజు సాయంత్రం అచ్చెం నాయుడును ఏసీబీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నారు. కోర్టు అచ్చెం నాయుడుకు రిమాండ్‌ విధిస్తుందా..? లేదా మరింత విచారణ కోసం ఏసీబీ కస్టడీకి ఇస్తుందా..? చూడాలి. ఏది ఏమైనా .. ఈ విషయంలో చంద్రబాబు అండ్‌ టీం ఊహించని విధంగా ఏసీబీ అధికారులు తమ పని తాము చేసుకుపోయారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అయినా రేపో, మాపో టీడీపీ.. అచ్చెం నాయుడు విషయంపై నిబంధనలకు విరుద్ధంగా ఏసీబీ వ్యవహరించిందని, వెంటనే బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టుకు వెళ్లినా ఆశ్చర్యం లేదు.