iDreamPost
iDreamPost
నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాజకీయాల్లో మాంచి ‘నైపుణ్యం’ ఉన్నోడని ఆయన అభిమానులు చెబుతుంటారు. అబ్బే అన్నీ వెనుకనుంచి చేసే రాజకీయాలేనని ఆయన ప్రత్యర్ధులు దెప్పిపొడుస్తుంటారు. నిజానిజాలను ప్రజలు తేల్చుకుంటారనుకోండి. కానీ ఇటీవలే ఆయన వేస్తున్న వ్యూహాలను పరిశీలిస్తున్న వారు అన్నన్నా.. చంద్రన్నా.. అనుకోకుండా ఉండలేకపోతున్నారట. గతంలో కూడా ఇటువంటి పలు సంఘటనలు ఉంటున్నప్పటికీ ఇటీవలే బైటకొచ్చిన ఓ వ్యవహారంలో చంద్రన్న స్ట్రాటజీని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారట.
ఇంతకీ ఏంటనుకుంటున్నారా?.. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక విషయం గురించేనండీ. ఇక్కడి నుంచి వైఎస్సార్‌సీపీ తరపున పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బల్లి దుర్గాప్రసాదరావు ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో అక్కడ జరగబోయే ఉప ఎన్నికల్లో తాము పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో పాటు బీజేపీ పోటీచేస్తే మద్దతు ఇస్తామంటూ చంద్రబాబు ఆఫరిచ్చారని సోషల్ మీడియా టాక్ నడుస్తోంది. ఈ విషయం తెలిసిన విమర్శలకు పనిదొరికేసింది.
నిజానికి తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దుర్గాప్రసాదరావు కూడా రెండులక్షల ఇరవై ఎనిమిది వేలకుపైగా రికార్డు మెజార్టీతో గెలుపొందారు. 15 నెలల క్రితం జరిగిన ఈ ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు అక్కడ అధికార పక్షంపై పెద్దగా వచ్చే వ్యతిరేకత కూడా లేదు దీనికి తోడు సంక్షేమ పథకాల అండ ఎలాగూ ఉంటుంది. దీంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి గెలిచేందుకే అత్యధికంగా అవకాశాలు ఉన్నాయి.
అధికార పార్టీ అయిన వైఎస్సార్‌సీపీకి ఇంత మొగ్గు కన్పిస్తున్న నేపథ్యంలో అక్కడ పోటీ చేస్టే పరువుపోగొట్టుకోవడమేనని టీడీపీ సీనియర్లు కూడా అభిప్రాయపడుతున్నారట. అయినప్పటికీ అదేదో తాము బీజేపీ కోసం త్యాగం చేస్తున్నట్టుగా చంద్రబాబు ‘మద్దతు ఇస్తాను’ అనడంతో విశ్లేషకులే ముక్కునవేలేసుకుంటున్నారు.
ఆక్షేపణలు ఎన్ని ఉన్నాగానీ చంద్రబాబు వ్యూహాన్ని ఇక్కడ విశ్లేషిస్తున్నారు. బీజేపీనీ పోటీలో దింపడం, వారికి తాను మద్దతు ఇవ్వడం ద్వారా దెబ్బతింటే బీజేపీ తింటుంది, తనకు–బీజేపీ నాయకత్వానికి మధ్య ఒక లైన్ ఏర్పడుతుందన్న ద్విముఖ వ్యూహంతోనే చంద్రబాబు ఈ తరహా ఆఫర్ ఇచ్చినట్టుగా అభిప్రాయపడుతున్నారు. మరో వైపు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో సొంతంగా సర్వే చేసి నిర్ణయిస్తామని, సొంత పార్టీ కేడర్‌ను కూడా చంద్రబాబు మరోవైపు దువ్వుతున్నారట. ఇలా ఏకకాలంలో మూడు వ్యూహాలను అమలు చేస్తుండడం వల్లే అన్నన్నా.. చంద్రన్నా అంటున్నారట.