iDreamPost
android-app
ios-app

తమ్ముళ్లూ ఇలా ఎవరైనా చేస్తారా..?

తమ్ముళ్లూ ఇలా ఎవరైనా చేస్తారా..?

ఓడలు బండ్లు.. బండ్లు ఓడలవుతాయంటారు. అందుకే ఇతరుల గురించి మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడాలంటారు. లేదంటే రేపు మనం కూడా అ స్థితిలోకి వచ్చినప్పుడు నవ్వులపాలుకాకతప్పదు. మరీ ముఖ్యంగా ప్రజా జీవితంలో ఉండేవారు అత్యంత జాగ్రత్తగా తమ నాలుకను ఉపయోగించాలి. దేశంలోనే సీనియర్‌ రాజకీయ నాయకుడును, బెస్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌ను అని చెప్పుకునే చంద్రబాబు అయితే మరింత అప్రమత్తంగా మాట్లాలి. లేదంటే తర్వాత రోజుల్లో విమర్శలపాలవ్వాల్సి వస్తుంది.

నాడు – నేడు.. అంటూ చంద్రబాబు మాటలను ప్రసారం చేస్తూ ఇప్పటికే రాజకీయ ప్రత్యర్థులు బాబుకు గుక్కతిప్పుకోనివ్వడంలేదు. ఎప్పటికప్పడు మాట మార్చే చంద్రబాబును యూటర్న్‌ స్పెషలిస్ట్‌గా అభివర్ణిస్తారు. రాజకీయ ప్రత్యర్థుల వ్యవహారాలౖపై విమర్శలు, హేళనలు చేసే చంద్రబాబు.. ఇప్పుడు ఆయన కూడ అవే పనులు చేస్తూ నవ్వులపాలవుతున్నారు. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తన పార్టీ రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిషోర్‌ను ఎంచుకున్నారు. ఓ బహిరంగ సభలో ప్రశాంత్‌ కిషోర్‌ను పరిచయం కూడా చేశారు. దీనిపై నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. హేళనగా మాట్లాడారు. ఎవరైనా వ్యూహకర్తను పెట్టుకుంటారా..? పెట్టుకుంటే మాత్రం బయటకు చెబుతారా..? అంటూ వైఎస్‌ జగన్‌ చర్యను ఎగతాళి చేశారు.

కాలం గిర్రున తిరిగింది. కాలం ప్రతి ఒక్కరికి సమాధానం, బుద్ధి చెబుతుందంటారు. ఇప్పుడు చంద్రబాబుకు కూడా కాలం బుద్ధి చెప్పింది. 2019 ఎన్నికల్లో బాబు ఘోరంగా ఓడిపోయారు. పార్టీ నేతలు కొంత మంది తమ దారి తాము చూసుకున్నారు. మరికొంత మంది సైలెంట్‌ అయ్యారు. పార్టీ క్యాడర్‌ చెల్లాచెదురైంది. దేశంలనే బలమైన క్యాడర్‌ ఉన్న ప్రాంతీయ పార్టీ తమది అని చెప్పుకునే చంద్రబాబు తెల్లమొహం వేశారు. దిక్కుతోచని స్థితిలో తాను కూడా ఎన్నికల వ్యూహకర్తను పెట్టుకున్నారని చెబుతున్నారు. ప్రశాంత్‌ కిషోర్‌ మాదిరిగా.. పంజాబ్‌కు చెందిన రాబిన్‌ శర్మ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యూహకర్తగా పని చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.

పార్టీలో పదవులు ఎవరికి ఇవ్వాలనేది కూడా రాబిన్‌శర్మ సర్వే చేసి చెప్పిన తర్వాతే.. చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది. అందుకే ఈ రోజు ప్రకటించిన జాతీయ, రాష్ట్ర కమిటీల్లో.. ఏపీ, తెలంగాణ అధ్యక్షులను ప్రకటించారు కానీ.. కమిటీలను ప్రకటించలేదు. అదే సమయంలో జాతీయకార్యవర్గాన్ని మాత్రం పూర్తిగా భర్తీ చేశారు. రాష్ట్ర కమిటీని ప్రకటించకపోవడానికి.. రాబిన్‌ శర్మ టీం చేస్తున్న సర్వే ఇంకా పూర్తికాకపోవడమనే చర్చ సాగుతోంది. ఏది ఏమైనా.. ఎన్నికల వ్యూహకర్తను పెట్టుకున్న వైఎస్‌ జగన్‌ను ఎగతాళి చేసిన చంద్రబాబు.. ఇప్పుడు జగన్‌ బాటలోనే నడవడం విశేషమనే చెప్పాలి. నాడు వైఎస్‌ జగన్‌ను హేళన చేశారు కదా.. అంటే.. గతాన్ని పట్టుకుంటే భవిష్యత్‌ ఉండదు కదా అని తనకు తానే సర్దిచెప్పుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబుది.