iDreamPost
android-app
ios-app

బడ్జెట్‌ సమావేశాలకు అస్త్రం సిద్ధం చేసుకున్న చంద్రబాబు..!

బడ్జెట్‌ సమావేశాలకు అస్త్రం సిద్ధం చేసుకున్న చంద్రబాబు..!

మరో రెండు రోజుల్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 27న శుక్రవారం నుంచి సమావేశాలు జరగనున్నాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో సమావేశాలు నాలుగైదు రోజులు మాత్రమే జరిగే అవకాశం ఉంది. బడ్జెట్‌ పెట్టడం, ఆమోదించుకోవడం అంతా శరవేగంగా చేయాల్సిన పరిస్థితి కరోనా కారణంగా తలెత్తింది.

ఈ సమావేశాల్లో ప్రభుత్వంపై అస్త్రాలు సంధించేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు సిద్ధమవతున్నారు. సమావేశాల్లో కరోనా వైరస్‌ అంశంగా చర్చ జరిగే అవకాశం ఉంది. కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం సహాయం అంశాలు ప్రముఖంగా ప్రతిపక్షం లేవనెత్తే ఆలోచనలు చేస్తున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు నిన్న సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌కు వ్యూహాత్మకంగా లేఖ రాశారని చెప్పవచ్చు. జనతా కర్ఫ్యూ జరిగిన ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రజలు ఇబ్బందులు పడకుండా నెలకు సరిపడా బియ్యం ఈ నెల 29వ తేదీనే అందిస్తామని చెప్పారు. ఇతర అవసరాలకు కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున ఏప్రిల్‌ 4వ తేదీన ఇస్తామని తెలిపారు.

ప్రజలకు ప్రభుత్వం అందించే సహాయంపై చంద్రబాబు లేఖ రాశారు. పేద కుటుంబాలకు రెండు నెలలకు సరిపడా బియ్యం, పప్పులు, వంటనూనె, చక్కెర, కూరగాయలు, ఇతర నిత్యవసర వస్తువులతోపాటు 5 వేల రూపాయల నగదు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. రేపు అసెంబ్లీలో కూడా ఈ అంశాలనే చంద్రబాబు ప్రముఖంగా ప్రస్తావించి ప్రజల వద్ద మార్కులు కొట్టేయాలనుకుంటారనడంలో సందేహం లేదు.

చంద్రబాబు పై విధంగా సరుకులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తే బడుగుల్లో ఓ సందేహం వస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం హాయంలో బియ్యంతోపాటు కందిపప్పు, చక్కెర, గోదుమలు తదితర 9 రకాల వస్తువులు ఇచ్చేవారు. చంద్రబాబు వచ్చారో లేదో వాటన్నింటిని తీసేసి కేవలం బియ్యం మాత్రమే ఇచ్చారు. చంద్రబాబు డిమాండ్‌ చేస్తున్నట్లు బియ్యంతోపాటు ఇతర నిత్యవసర సరుకులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకే ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇస్తోందన్న విషయం గుర్తించాలి. లాక్‌డౌన్‌ ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే ప్రకటించగా.. ఈ మేరకే ప్రభుత్వం సహాయం చేస్తోంది. మళ్లీ ఆ గడువు పెంచితే దానికి అనుగుణంగా సహాయం చేసే అవకాశం ఉంది.