Idream media
Idream media
తమ పార్టీ నేతలను వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్‌లు చేస్తోందని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తమ పార్టీ నేతల అరెస్ట్‌లకు నిరసనగా కాగడాలు పట్టి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ నేతలు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు తదితరులతో కలసి తాడేపల్లిలోని తన నివాసంలో కొద్దిసేపటి క్రితం చంద్రబాబు కాగడాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమ అరెస్ట్‌లు నిలిపివేయాలని, వేధింపులు ఆపాలని చంద్రబాబు, పార్టీ నేతలు నినాదాలు చేశారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, పార్టీ ఎమ్మెల్యే అచ్చెం నాయుడును పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి నిన్న శనివారం గుంటూరు జీజీహెచ్‌కు వచ్చిన చంద్రబాబు తిరిగి హైదరాబాద్ వెళ్లలేదు. కృష్ణానడి కరకట్ట వెంబడి ఉన్న తన నివాసంలో కుమారుడుతో కలసి ఉంటున్నారు. అచ్చెం నాయుడు జుడిషియల్ రిమాండ్‌లో ఉండడం పరామర్శించలేకపోయారు. ఈ నెల 16వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో చంద్రబాబు తాడేపల్లిలోనే ఉండిపోయారు.
కరకట్టపై ఉన్న ఇంటి నుంచే పార్టీ నేతలతో జూమ్ యాప్ ద్వారా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా అచ్చెం నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్‌లపై పార్టీ నేతలతో సమీక్ష చేసిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైసీపీ కండువా కప్పుకుంటే కోట్ల రూపాయల జరిమానాలు రద్దు చేస్తున్నారని, లేదంటే జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. పోలీసులు అరెస్ట్ చేయడం ద్వారా అచ్చెం నాయుడు గాయం తిరిగబెట్టి, మళ్లీ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ ఘటనపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.