iDreamPost
iDreamPost
చంద్రబాబు ఎన్నో సార్లు చెప్పిన విజన్ 2020 వచ్చేసింది. కానీ ఆయన వ్యూహాలు మాత్రం ఫలించడం లేదు. జగన్ జమానాలో కూడా వైఎస్సార్ కాలం నాటి అస్త్రాలు సంధించడంతో అసలుకే ఎసరు వస్తోంది. ప్రయత్నాలు ఫలించకపోవడమే కాకుండా బూమరాంగ్ కావడంతో బాబుకి ఏమీ పాలుపోతున్నట్టు కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీకి ఈ పరిణామాలు పెద్ద గుదిబండగా మారుతున్నాయి.
చంద్రబాబు ప్రధాన అస్త్రం మీడియా ఫలితం ఇవ్వడం లేదా
వైఎస్ జగన్ ప్రభుత్వం మీద, సీఎం వ్యక్తిత్వం మీద గురిపెట్టిన చంద్రబాబు దానికి ప్రధాన అస్త్రంగా మీడియాను సంధించారు. కానీ వర్కవుట్ కావడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. సోషల్ మీడియాలో యుగంలో రెండు పత్రికలు, నాలుగు చానెళ్లు చెప్పేస్తే నమ్మేసే జనం కనిపించడం లేదు. దాంతో అమరావతిలో అద్భుతాలు నిర్మించామని చెప్పినా శేఖర్ గుప్తా వంటి వారు నమ్మవచ్చు గానీ ఏపీ ప్రజలకు మాత్రం విశ్వాసం లేదని ఆరు నెలల క్రితమే తేలిపోయింది. రాజధాని ప్రాంతంలో ఏదో జరిగిపోతోందని, భూగోళం బద్ధలయ్యేటంత స్థాయిలో ఉద్యమం సాగుతోందన్నట్టుగా డజను దినాల నుంచి సదరు మీడియా కోడై కూస్తున్నా కనీసం బెజవాడ వాసులు కదలడం లేదు. చివరకు అందరినీ కదిలిస్తున్నట్టు జేఏసీ ఏర్పాటు చేసినా రోజూ వెలగపూడి చుట్టూ తిరుగుతున్న హైకోర్ట్ లాయర్లు కూడా వారి మాటలను విస్వసించకుండా విధులకు హాజరయ్యారు
సోషల్ మీడియా యుగంలో సొంత మీడియా పనిచేయదని తెలిసినా పదే పదే ప్రయత్నం చేయడం ద్వారా ఫలితం సాధించవచ్చని ఆశించిన చంద్రబాబుకి ఈ పరిణామాలు మింగుడుపడడం లేదు. జగన్ ని ఓ ప్రాంతానికి, ఓ సామాజిక తరగతికి వ్యతిరేకిగా చిత్రీకరించాలని చేస్తున్న యత్నాలు కూడా ఫలించకపోవడంతో చంద్రబాబు చివరకు జాతీయ మీడియా సంస్థలను రంగంలో దింపాలని చూశారు. కానీ సీన్ లోకి వచ్చిన వెంటనే శేఖర్ గుప్తాకి పెద్ద స్థాయిలో కౌంటర్లు రావడంతో ఆయన సైతం చతికిలపడాల్సి వచ్చింది. కీలకమయిన మీడియా అస్త్రం చేజారిపోవడంతో చంద్రబాబుకి చిక్కులు పెరుగుతున్నాయి.
సొంత జనం సహాయంతో నిరసనలు
అమరావతి స్థానంలో మూడు రాజధానుల ప్రతిపాదన రాగానే రాజధాని గ్రామాల్లో నిరసనలు కనిపించలేదు. చివరకు జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ వచ్చిన వెంటనే మందడం వాసులు తప్ప మిగిలిన వారు కదలలేదు. దాంతో చంద్రబాబు సీన్ లోకి రావడం, సొంత పార్టీ కార్యకర్తలను పురిగొల్పడంతో నిరసనలు మొదలయ్యాయి. చివరకు తమకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనలో ఉన్న రైతులంతా వారితో కలిశారు. ఈ సందర్భంగా పెయిడ్ ఆర్టిస్టుల మాదిరిగా కొందరు సాగించిన వ్యవహారం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా, అమరావతి నిరసనల మీద అపోహలు పెంచింది. మిగిలిన ప్రాంతాల వారి విశ్వాసాన్ని చూరగొనడానికి బదులుగా నష్టాన్ని మిగిల్చింది. దాంతో టీడీపీ ఆఫీసు నుంచి వివిధ విభాగాల కార్యకర్తలను రంగంలో దిగినా ఉపయోగం లేదని తేలింది. చివరకు క్యాబినెట్ మీటింగ్ అనంతరం రాజధాని ప్రాంతంలో రగడకు చేసిన ప్రణాళికలు కూడా ప్రభుత్వ వ్యూహత్మక నిర్ణయం ముందు తేలిపోయాయి. ఈ పరిస్థితి కూడా చంద్రబాబు సీన్ నడవడం లేదని చాటుతోంది.
జ్యుడీషియల్ ఎంక్వయిరీ
రాజధాని ప్రకటన చేయకముందే ఆరు నెలల పాటు సాగించిన భూ కొనుగోళ్ల వ్యవహారంపై చాలా కాలంగా విమర్శలు వస్తున్నప్పటికీ నోరు మెదపని టీడీపీ ఇటీవల జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ చేసింది. తద్వారా న్యాయ విభాగంలో తనదైన ప్రభావం చూపగల సామర్థ్యం ఉన్న నాయకుడిగా పేరున్న చంద్రబాబు మళ్లీ అదే పంథాలో సాగుదామని ఆశించినట్టు కనిపించింది. అయితే ప్రభుత్వం దానికి కూడా కట్ చేస్తూ లోకాయుక్త లేదా సీబీఐ అనడంతో చంద్రబాబుకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. చివరకు సీబీఐ విచారణకు తాము సిద్ధం అని ఇప్పటి వరకూ ఒక్క టీడీపీ నాయకుడు కూడా మాట్లాడకపోవడం విశేషం. పైగా ఇప్పటికీ జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలంటూ ట్విట్టర్ లో చినబాబు డిమాండ్ చేస్తున్న తీరు విస్మయకరంగా కనిపిస్తోంది.
వైఎస్ రూటులోనే జగన్ మీద ప్రయత్నాలు
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని బద్నాం చేసేందుకు చేసిన ప్రయత్నాలనే మళ్లీ జగన్ మీద పునరావృతం చేశారు. కానీ ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకన్న జగన్ మరింత పగడ్భందీగా వ్యవహరిస్తున్న తీరు టీడీపీ ఆటలకు చెక్ పెడుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా మతం కోణంలో సాగించిన రచ్చ గానీ, ఇంగ్లీష్ మీడియం మీద చేసిన ప్రచారం గానీ , ఏపీలో పథకాల గురించి ప్రజల్లో అపోహలు పెంచేందుకు సృష్టించిన కథనాలు కూడా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పాతపద్ధతిలోనే సాగుతుందనడానికి సాక్ష్యాలుగా ఉన్నాయి. కానీ జగన్ పాలనలో వాటిని ప్రజలు అంగీకరించే పరిస్థితి కనిపించలేదు. దానికి ప్రధానంగా ప్రభుత్వం వైపు నుంచి తీసుకున్న జాగ్రత్తలే కారణం.
కేంద్రాన్ని బూచిగా చూపించే యత్నం
పీపీపీ విషయం నుంచి రాజధాని వ్యవహారం వరకూ కేంద్రం దృష్టికి తీసుకెళతామని కొందరు టీడీపీ నేతలు చెబుతుంటే, చెప్పాల్సిన వాళ్లకు చెబుతానంటూ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడడం, అందుకు అనుగుణంగా సుజనా చౌదరి కామెంట్స్ గమనిస్తే జగన్ ని కట్టడి చేసేందుకు మోడీని బూచిగా చూపించే యత్నం సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. గతంలో రాజశేఖర్ రెడ్డి తీరు మీద కాంగ్రెస్ లోనే కొందరు నేతలతో అధిష్టానానికి ఫిర్యాదులు చేయించడం ద్వారా అడ్డుపుల్లలు వేసిన అనుభవం ఇక్కడ ఉపయోగిస్తున్నట్టు భావించవచ్చు. కానీ జగన్ సొంత పార్టీ ద్వారా చరిత్ర సృష్టించిన నాయకుడు కావడంతో ఈ అస్ర్రం కూడా ఫలించడం లేనట్టు కనిపిస్తోంది.
ఇలా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా జగన్ దూకుడు తగ్గకపోగా మరింత తీవ్రమవుతున్న వేళ, ఈ పరిణామాలను నియంత్రించేందుకు టీడీపీ అధ్యక్షుడు కొత్త బాటను పట్టాను. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ప్రాణాలు, భద్రత అంటూ ప్రస్తావించారు. తద్వారా సామ, దాన , బేధ, దండోపాయాల్లో ఆఖరి అస్త్రం సిద్ధం చేస్తున్నారా అనే అభిప్రాయాన్ని, సందేహాన్ని పలువురు వ్యక్తం చేసేటంత వరకూ వెళ్లారు. జగన్ లాంటి నాయకుడి ముందు ఇలాంటివి పనిజేయవని తెలిసినా చంద్రబాబు అదే దారిలో సాగుతున్న తీరు ఆశ్చర్యం అనిపించినా, ఆయనకు మరో గత్యంతరం లేని వాతావరణం కారణంగా అవసరంగా మారిందని పలువురు అంచనా వేస్తున్నారు. ఏమయినా ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో అన్ని రకాలుగా ఒత్తిడిలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం వేసే అడుగులు ఎటువైపుగా అయినా మళ్లవచ్చని పలువురు భావిస్తున్నారు. వ్యూహాలు ఫలించని వేళ అసహనంలో తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయన్నదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.