iDreamPost
android-app
ios-app

ఆ నలుగురూ ఎంపీలే, చంద్రబాబుకి భంగపాటు

  • Published Jun 19, 2020 | 1:13 PM Updated Updated Jun 19, 2020 | 1:13 PM
ఆ నలుగురూ ఎంపీలే, చంద్రబాబుకి భంగపాటు

ఊహించిన ఫలితమే వచ్చింది. వైఎస్సార్సీపీ అభ్యర్థులూ ఘన విజయం సాధించారు. ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు సాధించారు. మార్చినెలలో జరగాల్సిన ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. చివరకు ఈరోజు జరిగిన పోలింగ్ లో 173 ఓట్లు పోలయ్యాయి. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్ కి దూరమయ్యారు. పోలయిన ఓట్లలో నాలుగు ఓట్లు చెల్లలేదు. ఆ నాలుగూ టీడీపీకే చెందినవి కావడం విశేషం. పైగా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు బ్యాలెట్ పేపర్ల మీద టీడీపీకి వ్యతిరేకంగా కామెంట్స్ కూడా రాసినట్టు సమాచారం.

ఇక ఫలితాలు వెలవడిన నేపథ్యంలో నలుగురు వైఎస్సార్సీపీ నేతలు రాజ్యసభ సభ్యులయ్యారు. వారిలో పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి , పరిమళ్ నత్వానీ ఉన్నారు. ఒక్కో అభ్యర్థి విజయానికి 36 ఓట్లు కావాల్సి ఉండగా, వైసీపీ అభ్యర్థులు ఒక్కొక్కరికీ 38 ఓట్లు వచ్చాయి. ఆశించిన దానికంటే ఎక్కువ ఓట్లు రావడంతో ఆపార్టీ నేతలు ఆనందంలో మునిగిపోయారు. స్వీట్లు పంచుకుని విజయోత్సవాలు చేసుకున్నారు. పార్టీ తరుపున ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి నేతలు వారిని అభినందించారు.

ఈ సందర్భంగా నలుగురు కాబోయే ఎంపీలు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదం చేస్తానని పరిమళ్ నత్వానీ పేర్కొన్నారు. కేంద్రం స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై కృషి చేస్తానన్నారు. పిల్లి సుభాస్ చంద్రబోస్, మోపిదేవి మాట్లాడుతూ తాము ఎన్నడూ ఊహించని విజయం అని పేర్కొన్నారు. ఒకేసారి ఇద్దరు ఎంపీలు రాజ్యసభకు ఎన్నిక కావడం ఏపీ రాజకీయాల్లో ఇదే తొలిసారి అన్నారు. మత్స్యకారవర్గం నుంచి తాను తొలి ఎంపీగా రాజ్యసభలో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని మోపిదేవి అన్నారు. పార్టీ అధినేత ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రయోజనాల సాధనలో కృషి చేస్తానని అయోధ్య రామిరెడ్డి తెలిపారు.

టీడీపీ తరుపున బరిలో దిగిన వర్ల రామయ్యకు కేవలం 17 ఓట్లు మాత్రమే రావడంతో ఘోర పరాభవం మూటగట్టుకుంది. పార్టీ తరుపున ఉన్న ఎమ్మెల్యేలందరకూ కూడా కనీసంగా టీడీపీ అభ్యర్థికి ఓట్లు రాకపోవడం విశేషం.