అంత డైవర్షన్ అవసరమా బాబూ..

ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హఠాత్తుగా కృష్ణా జలాల అంశం తెరమీదకు వచ్చింది. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన చేస్తున్న ప్రయత్నాలతో తెలంగాణాలో విపక్షం రాజకీయాలకు తెరలేపింది. చాలాకాలంగా కేసీఆర్ మీద విమర్శలకు అవకాశం లేక తల్లడిల్లిపోతున్న కాంగ్రెస్ కి అదో అస్త్రంగా మలచుకోవాలని ముచ్చటపడుతోంది. అదే సమయంలో ఏపీలో ప్రతిపక్షానికి ఈ పరిణామం మింగుడుపడడం లేదు. కరవమంటే కప్పకు కోపం..విడవమంటే పాముకి కోపం అన్న చందంగా తయారయ్యింది. దాంతో టీడీపీ, జనసేన నేతలకు ఈ పరిస్థితి అర్థంకాకుండా మారింది. ఓవైపు బీజేపీ మాత్రం తెలంగాణాలో వద్దని, ఏపీలో పోతిరెడ్డిపాడు లిఫ్ట్ కట్టాలని చెబుతుండగా టీడీపీ, జనసేన కు మాత్రం అలాంటి అవకాశం కూడా ఉన్నట్టు కనిపించడం లేదు.

ఈ పరిణామాలతో టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆపార్టీ నేతలంతా కొత్త రాగం అందుకున్నారు. అందుకు తగ్గట్టుగా ఇదో డైవర్షన్ రాజకీయం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ప్రజల దృష్టి మళ్లించే యత్నంలో ఈవివాదాన్ని తెరమీదకు తెచ్చారని ఆయన చేస్తున్న వ్యాఖ్యలే ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. సహజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, వెనుకబడిన రాయలసీమ కోసం అంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనలను విపక్ష పార్టీ గా సమర్థించాలి లేదా వ్యతిరేకించాలి. కానీ బాబు మాత్రం ఆ రెండూ కాకుండా వింత వాదన చేస్తుండడమే విశేషంగా తయారయ్యింది.

నిజానికి ఆంధ్రప్రదేశ్ లో గానీ, తెలంగాణాలో గానీ ప్రభుత్వాలకు అలాంటి డైవర్షన్ ఎత్తులు వేయాల్సిన అవసరం కనిపిస్తోంది. కరోనా విషయంలో కూడా ఇరు ప్రభుత్వాలు సమర్తవంతంగా పనిచేస్తున్నాయనే అభిప్రాయం అటు కేంద్ర బృందాల నుంచి ఇటు రాష్ట్రాల ప్రజల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా పక్కనున్న తమిళనాడు, మహారాష్ట్రతో పాటుగా గుజరాత్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే ఇరు రాష్ట్రాల పరిస్థితి అదుపులోనే ఉంది. కేసుల సంఖ్య కన్నా డిశ్ఛార్జ్ లు ఎక్కువగా ఉండడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇక రాజకీయంగా చూసినా తెలంగాణాలో విపక్షాలు అవకాశాలు లేక తల్లడిల్లిపోతుంటే, ఏపీలో అసలు విపక్ష నాయకుడే పక్క రాష్ట్రంలో ఉండాల్సిన పరిస్థితి ఉంది.

ఇలాంటి సమయంలో ఇరువురు ముఖ్యమంత్రులు కలిసి ప్రజల దృష్టి మళ్లించాల్సిన పరిస్థితి ఉందా అంటే అలాంటి వాతావరణం కనిపించడం లేదు. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం అదో డైవర్షన్ రాజకీయం అంటూ వ్యాఖ్యానించడం మాత్రం ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.

Show comments