సృజనాత్మకత పేరుతో వచ్చే కొన్ని ప్రకటనలు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుంటాయి. క్రియేటివిటీతో ఫలానా ఉత్పత్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నంలో హద్దు దాటిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ప్రకటనలపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నేరుగా యూట్యూబ్, ట్విట్టర్ లకు లేఖ రాసింది.
కొన్ని పర్ఫ్యూమ్/ బాడీ స్ప్రే ప్రకటనలు శృతి మించుతున్నాయని కేంద్ర శాఖ పేర్కొంది. సామూహిక అత్యాచారాలను ప్రోత్సహించేలా చిత్రీకరించిన సదరు ప్రకటనలను వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది. మహిళల నైతికత, మర్యాదను తక్కువ చేసేలా ఎలా చిత్రీకరిస్తారని లేఖలో పేర్కొంది.
ఈ సందర్భంగా వినియోగదారులు సైతం ఆయా ప్రకటనలపై ఎలా ఆగ్రహంగా ఉన్నారో తెలిపింది. అవమానకరంగా ఉన్న ఒక పర్ఫ్యూమ్ ప్రకటనను వెంటనే తొలగించాలని ఆదేశించింది. మరోవైపు దేశంలో వస్తున్న ప్రకటనలపై అడ్వర్టైస్ మెంట్ కౌన్సిల్ సైతం అప్రమత్తంగా ఉండాలని, మార్గదర్శకాలను పాటించని ప్రకటనలకు వెంటనే సరైన నోటిసులు ఇవ్వాలని పేర్కొంది.
కేంద్ర శాఖకు మద్దతుగా దిల్లీ మహిళా కమిషన్ సైతం స్పందించింది. సామూహిక అత్యాచార సంస్కృతిని ప్రోత్సహించడంపై మండిపడింది. కుదిరితే ఆ సంస్థపై ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేయాలని కోరింది. సామాజిక మాధ్యమాలు, టీవీ ప్రకటనల్లో మహిళల్ని కించపరిచేలా ఉన్న ప్రకటనలను తొలగించాలని వారు కేంద్ర శాఖను కోరారు.