iDreamPost
android-app
ios-app

దేశం మునుగుతోంది మోడీ గారు..! ఎలాగంటే..?

  • Published Apr 26, 2021 | 4:04 PM Updated Updated Apr 26, 2021 | 4:04 PM
దేశం మునుగుతోంది మోడీ గారు..! ఎలాగంటే..?

దేశం వెలిగిపోతోంది.. ఇది బీజేపీ స్లోగన్. కానీ ఇప్పుడు కరోనా సునామీలో భారత దేశం మునిగిపోతోంది. వైరస్​ తో పోరులో గెలిచామంటూ ముందే సంబరాలు చేసుకున్న ప్రధాని మోడీ.. ఇప్పుడు మాత్రం జాగ్రత్తే మందు అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. వ్యాక్సినేషన్ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుని.. భారమంతా రాష్ట్రాలపై వేశారు.

నరేంద్ర మోడీ.. ఎప్పుడు ఏది మాట్లాడాలో.. ఎక్కడ ఏ స్విచ్ నొక్కాలో తెలిసిన వ్యక్తి! ఏడేళ్లుగా ప్రధాని పదవిలో ఉన్నా ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. మన్ కీ బాత్, పరీక్షా పే చర్చ అంటూ ఆయన చెప్పడమే ఉంటుంది తప్ప.. ఎదుటివారి ప్రశ్నలకు బదులివ్వరు. వ్యాక్సిన్ ధరల విషయంలో రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుంటే.. ఆయన మాత్రం తన తీరులోనే ఆదివారం మన్ కీ బాత్ చెప్పిపోయారు. జన్ కీ బాత్ మాత్రం ఎప్పుడూ వినలేదు.

అర్హులందరకీ ఇస్తారంట.. ఇంతకీ అర్హులెవరంటే..

ఆదివారం మన్ కీ బాత్​ లో మాట్లాడిన ప్రధాని మోడీ.. అర్హులందరికీ వ్యాక్సిన్ వేయడాన్ని కేంద్రం కొనసాగిస్తుందని ప్రకటించారు. అయితే ఇక్కడ అర్హులు.. 45 ఏళ్లు పైబడిన వాళ్లు. అంతే తప్ప 18 ఏళ్లు పైబడిన వాళ్లు కాదు. జనవరి నుంచి ఇప్పటిదాకా 45 ఏళ్లు పైబడిన వాళ్లకు ఇప్పటిదాకా 14 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇందులో ఫస్ట్ డోసు వేయించుకున్న వాళ్లు 10 కోట్ల మంది దాకా ఉన్నారు. అంటే దేశ జనాభాలో 10 శాతం మందికి కూడా రెండు డోసులు వేయలేదు. మరోవైపు మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వాళ్లకు వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతోంది. ఈ కేటగిరీలో భారీ సంఖ్యలో జనం వ్యాక్సిన్ వేయించుకునేందుకు అర్హత పొందుతారు. కానీ వీరికి వ్యాక్సిన్ వేసే భారమంతా రాష్ట్రాలపై వేసింది కేంద్రం. తాము సేకరించే వ్యాక్సిన్లను రాష్ట్రాలకే ఫ్రీగా ఇస్తామని చెబుతున్నా.. మిగతా వ్యాక్సిన్ల కొనుగోలుకు మాత్రం రాష్ట్రాలే ఖర్చు భరించాల్సిన పరిస్థితి. పైగా తాము ఫ్రీగా ఇచ్చే వ్యాక్సిన్లను పూర్తిగా వినియోగించుకోవాలంటూ రాష్ట్రాలకు సూచిస్తోంది.

ఒక్క వ్యాక్సిన్.. మూడు ధరలు

వ్యాక్సిన్ ధరలను మూడు రకాలుగా విభజించి ప్రకటించింది సీరం ఇన్​స్టిట్యూట్. కేంద్రానికి రూ.150కే ఇస్తామని, రాష్ట్రాలకు రూ.400కు, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.600కు ఇస్తామని వెల్లడించింది. ఇది కాస్తా దేశంలో దుమారం రేపింది. ఒకే దేశం.. ఒకే వ్యాక్సిన్.. మూడు ధరలు మాత్రం ఎందుకంటూ దేశం మొత్తం ఒకే గొంతుకై ప్రశ్నించింది. కానీ దీనిపై మోడీ క్లారిటీ ఇవ్వలేదు. స్పందించిన కేంద్రం మాత్రం.. తాము రూ.150కి సేకరించే వ్యాక్సిన్లను రాష్ట్రాలకు పంపిణీ చేస్తామని చెప్పింది. అలాంటప్పుడు మొత్తం వ్యాక్సిన్లను కేంద్రమే తీసుకుని రాష్ట్రాలకు ఎందుకు పంపిణీ చేయకూడదని ప్రశ్నలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. రూ.150కి సేకరించిన వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఇచ్చి.. అందుకు ఖర్చు అయిన మొత్తాన్ని రాష్ట్రాల నుంచే తీసుకోవచ్చు. కానీ కేంద్రం తీరు వల్ల రాష్ట్రాలపై ఒక్కో డోసుకు రూ.250 వరకు భారం పడనుంది. లాక్​డౌన్లు, కర్ఫ్యూలతో ఆదాయం లేక కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాలపై వ్యాక్సిన్ భారం మోపడం ఎంత వరకు సమంజసం అన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాటర్ బాటిల్ రేటు కంటే తక్కువకే వ్యాక్సిన్లు ఇస్తామన్న ప్రకటనలు ఏమయ్యాయని జనం నిలదీస్తున్నారు.

Also Read : మరోసారి లాక్ డౌన్ అనివార్యమా..?

రాష్ట్రాల మధ్య ఆక్సిజన్ గొడవలు

రాష్ట్రాల మధ్య మెడికల్ ఆక్సిజన్ గొడవలకు కేంద్రం కూడా ఒక కారణం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో తయారవుతున్న ఆక్సిజన్​ను మహారాష్ట్రకు పంపుతున్నారు. కానీ తమిళనాడు నుంచి ఏపీ, తెలంగాణకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. విశాఖ ఉక్కు నుంచి స్థానికంగా ఏపీలో కొంత మేర ఆక్సిజన్ అందుతున్నా.. తెలంగాణకు మాత్రం కేటాయించలేదు. దీంతో ఒడిశా నుంచి ఆర్మీ విమానాల్లో తెలంగాణకు ఆక్సిజన్ ను తెప్పించుకుంటున్నారు. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు తిప్పే బదులు.. స్థానికంగా ఉత్పత్తి అవుతున్న మెడికల్ ఆక్సిజన్ ను అక్కడే సర్దుబాటే చేస్తే బాగుంటుంది. కానీ కేంద్రం ఆ పని చేయడం లేదు. దీంతో రాష్ట్రాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణకు తమ రాష్ట్రం నుంచి ఆక్సిజన్ సరపరా ఆపాలంటూ కేంద్రానికి తమిళనాడు సీఎం పళని స్వామి లేఖ రాశారు. తమ రాష్ట్ర అవసరాల కన్నా తక్కువగా తమకు కేటాయింపులు చేశారని, కానీ తమ దగ్గర ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్​ను తెలుగు రాష్ట్రాలకు పంపుతున్నారని ఆయన కేంద్రాన్ని తప్పుబట్టారు. తమ రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతనే మిగిలిన రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేయగలమని పేర్కొన్నారు. పరిస్థితి ఇలానే ఉంటే రాష్ట్రాల మధ్య గొడవలు ముదిరే ప్రమాదం ఉంది. కానీ మోడీ మాత్రం.. ఎక్కడా ఆక్సిజన్ ట్యాంకులను ఆపొద్దని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు.

వెంటిలేటర్లు కొన్నా.. ఉపయోగించలేదు

గత ఏడాది దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలోనే వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉందనే విషయం కేంద్రానికి తెలుసు. 2020లో దేశంలో వెంటిలేటర్ల సంఖ్య 18 వేల నుంచి 20 వేల దాకా ఉండొచ్చని అంచనా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 లక్షలకు పైగా వెంటిలేటర్లు అవసరమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గతేడాది మార్చిలో ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్​కు ఎంత మొత్తంలో విరాళాలు వచ్చాయనే దానిపై లెక్కాపత్రం లేదు. ఆ డబ్బును ఏం చేస్తున్నారనే వివరాలు కూడా అందుబాటులో లేవు. అయితే ఇదే పీఎం కేర్స్ ఫండ్ ద్వారా దాదాపు 30 వేల వెంటిలేటర్లను వివిధ సంస్థల ద్వారా కొనుగోలు చేసినట్లు సమాచారం. పోనీ కొన్న కాసిన్ని వెంటిలేటర్లను కూడా సరిగ్గా వాడుకోలేదు. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లాంటి రాష్ట్రాల్లోని కొన్ని ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు ఇంకా ఇన్‌స్టాల్ కూడా చేయలేదు. చాలా ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు వినియోగం లేకుండా దుమ్ముపట్టిపోతున్నాయి.

551 ప్లాంట్లు ఎప్పుడు రెడీ అవుతయ్

దేశవ్యాప్తంగా 551 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేయనున్నట్టు పీఎంవో చెప్పింది. ఇందుకోసం పీఎం కేర్స్ నుంచి నిధులు అందించనున్నట్టు తెలిపింది. వీలైనంత త్వరగా ఆ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాని మోడీ ఆదేశించినట్లు తెలిపింది. ప్లాంట్ల ఏర్పాటు పనులను కేంద్ర ఆరోగ్య శాఖ చూసుకుంటుందని చెప్పింది. ఈ ఏడాది ప్రారంభంలో 162 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రూ.201.58 కోట్లను పీఎం కేర్స్ నుంచి కేటాయించామని పేర్కొంది. అయితే ఎప్పటి లోపు పూర్తవుతాయనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారనేది కూడా క్లారిటీ లేదు.

Also Read : కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌కు కారణం ఎవరో చెప్పిన మద్రాస్‌ హైకోర్టు