iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హస్తిన పర్యటన హఠాత్తుగా వాయిదాపడింది. ఏపీ ముఖ్యమంత్రికి తొలుత అపాయింట్ మెంట్ ఖరారు చేసిన కేంద్ర హోం మంత్రి ఆ తర్వాత దానిని వాయిదా వేసుకున్నారు. ముఖ్యంగా పశ్చిమ తీరంలో నిసర్గ తుఫాన్ విరుచుకుపడుతున్న వేళ కేంద్ర మంత్రి పూర్తిగా అటువైపు దృష్టి సారించాల్సి వచ్చింది. ముఖ్యంగా అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్, మహారాష్ట్రలలో నిసర్గ తుఫాన్ తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఇలాంటి తరుణంలో ఇతర అంశాల కన్నా ఆయా రాష్ట్రాలకు అందించాల్సిన సహాయచర్యల పట్ల కేంద్రం ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వచ్చిన తరుణంలో ఏపీ సీఎం పర్యటన వాయిదా పడింది.
ముఖ్యమంత్రి హస్తిన పర్యటనకు వెళితే పలు అంశాలను కేంద్రం ముందు ఉంచే అవకాశం ఉందని అంతా భావించారు. దానికి తగ్గట్టుగా వివిధ శాఖల మంత్రులను కూడా కలిసేందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ముఖ్యంగా హోం మంత్రి అమిత్ షా ముందు కోర్కెల చిట్టా వినిపించే అవకాశం ఉందని అంతా భావించారు. ఏపీ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా సీఎం ఢిల్లీ టూర్ జరుగుతున్నట్టు ప్రభుత్వం కూడా ప్రకటించింది.
అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీకాలం పొడిగింపు విషయాన్ని సీఎం ప్రస్తావిస్తారని అంతా అంచనా వేశారు. అయితే ప్రస్తుతం అలాంటి అవసరం రాకుండానే కేంద్రం సానుకూలంగా స్పందించింది. సీఎస్ పదవీకాలం పొడిగించింది. అయితే ఏపీ ప్రభుత్వం ఆశించినట్టుగా ఆరు నెలలు కాకుండా కేవలం మూడు నెలలకు మాత్రమే పొడిగింపు ఉత్తర్వులు ఇచ్చింది. దీనితో సెప్టెంబర్ చివరి వరకు నీలం సహానీ సీఎస్ గా కొనసాగుతారు.
సీఎస్ పదవీకాలం పొడిగింపుతో సీఎం కోర్కెలలో ఒకదాన్ని కేంద్రం నెరవేర్చిందనే చెప్పవచ్చు. బీజేపీ అధినేతలకు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఏపీ లో అధికార వైఎస్సార్సీపీ అధినేతకు ఉన్న సానుకూల సంకేతాలకు ఇదో సంకేతంగా చెబుతున్నారు. ఇటీవల పలువురు అధికారుల పదవీకాలం పొడిగింపు విషయంలో కేంద్రం కొర్రీలు వేస్తోంది. కొన్ని ఫైళ్లు వెనక్కి పంపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎస్ పదవీకాలం విషయంలో కేంద్రం ఎలా స్పందిస్తుందోననే ఉత్కంఠ కనిపించింది. చివరకు సీఎం నేరుగా అడగకుండానే బీజేపీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడడం జగన్ అంటే గిట్టని వారికి మింగుడుపడే అవకాశంగా కనిపించడం లేదు.
ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా వ్యవహరాన్ని కూడా కొందరు వక్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ తాజాగా కేంద్రం నుంచి సీఎస్ పదవీకాలం పొడిగింపు విషయంలో వచ్చిన సానుకూల సంకేతాలు గమనిస్తే జగన్ కి, కేంద్ర బీజేపీ నేతలకు మధ్య ఉన్న సంబంధాలు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని అంతా భావిస్తున్నారు.