iDreamPost
android-app
ios-app

రంగంలోకి కేంద్ర బలగాలు.. పారా హూషార్‌..

రంగంలోకి కేంద్ర బలగాలు.. పారా హూషార్‌..

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో ప్రజలు బయటతిరుగుతూనే ఉన్నారు. కరోనా మహమ్మరి నియంత్రణకు సోషల్‌ డిస్టెన్స్‌ ఒక్కటే మార్గమని దేశ ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులు పదే పదే మొత్తుకుంటున్నా.. దణ్నం పెట్టి వేడుకుంటున్నా నగరాలు, పట్టణాలల్లో ప్రజలు రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. స్థానిక పోలీసులు వారిని కంట్రోల్‌ చేసేందుకు లాఠీలు కూడా ఝలిపిస్తున్నారు. అయినా మార్పు రావడంలేదు.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా తెలంగాణలో ఉంది. ముఖ్యంగా నగరాల్లో ఈ మహమ్మరి వేగంగా విస్తరిస్తోంది. ఏపీలో కరోనా కేసులు 12కు చేరుకోగా.. తెలంగాణలో నాలుగు పదులు దాటాయి. కరోనా వైరస్‌ వ్యాప్తికి కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సైతం వెనుకాడబోమన్న సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఈ బలగాలు హైదరాబాద్‌ నగరానికి చేరుకున్నాయి.

ప్రజలందరూ లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్లకే పరిమితం అవ్వాలని సీఎం కేసీఆర్‌ పదే పదే విజ్ఞప్తి చేశారు. ఈ నెల 23వ తేదీన లాక్‌డౌన్‌ను ప్రజలు లెక్కచేయకుండా వీధుల్లోకి వచ్చారు. ఆ రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ సంచారం నిషేధించారు. మర్యాదగా తాను చెప్పేవి వినాలని, లేదంటే సూట్‌ ఎట్‌ సైట్‌ (కనిపిస్తే కాల్చివేత) వరకూ తెచ్చుకోవద్దని హెచ్చరించారు.

ప్రస్తుతం తెలంగాణ కరోనా వైరస్‌ రెండో దశలో ఉంది. మూడో దశకు చేరుకుంటే పరిస్థితి అదుపుచేయలేమని కేసీఆర్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే వచ్చే నెల 14వ తేదీ వరకూ విధించిన లాక్‌డౌన్‌ను ప్రజలు విధిగా పాటించాలి. నిత్యవసరాలు, కూరగాయలు పేరుతో ప్రజలు బయటతీరుగుతున్నారు. యువకులు బైక్‌లపో ఖాళీ రోడ్లలో చక్కర్లు కొడుతున్నారు. ఇవన్నీ కంట్రోల్‌ చేసేందుకే కేసీఆర్‌ కేంద్ర బలగాలను రాష్ట్రానికి రప్పించినట్లు సమాచారం. ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగితే మాటలు, బతిమాలడాలు, సూచనలు ఉండవు.. దొరికిన వారిని దొరికినట్లు చితక్కొట్టుడే. పారా హూషార్‌ హైదరాబాద్‌.