iDreamPost
android-app
ios-app

నాడు వద్దు.. నేడు ముద్దు..

నాడు వద్దు.. నేడు ముద్దు..

రెండు కళ్లు, రెండు చిప్పలు, రెండు నాల్కల సిద్ధాంతంలో తనకు సాటి వచ్చే వారు మరొకరు లేరని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎప్పటికప్పుడు నిరూపించుకుంటుంటారు. దేశంలో సీనియర్‌ నేతను తానేనని చెప్పుకునే చంద్రబాబు… రెండు నాల్కల ధోరణిలో తనలా మరొకరు వ్యవహరించలేరని కూడా చాటిచెబుతున్నారు. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు మారే చంద్రబాబు తన తీరును మత్తు డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారంలో మరోసారి బయటపెట్టుకున్నారు.

మత్తు డాక్టర్‌ సుధాకర్‌ ఘటనపై రాష్ట్ర హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడాన్ని తాను హృదపూర్వకంగా స్వాగతిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయనపై చేసిన కుట్రను సీబీఐ బయపటపెడతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది శుభపరిణామం అని సంతోషం వ్యక్తం చేశారు చంద్రబాబు. కట్‌ చేస్తే.. తాను ముఖ్యమంత్రిగా ఉన్న చివరి ఏడాదిలో రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ బోర్టు పెట్టారు. రాష్ట్రంలో ఏ కేసు కూడా సీబీఐ దర్యాప్తు చేయకుండా ఏకంగా జీవో జారీ చేశారు. నేడు సీబీఐపై ఉన్న విశ్వాసం నాడు లేదంటూ చంద్రబాబు చెప్పడమే కాదు.. సీబీఐ కన్నా రాష్ట్ర పోలీసులే దర్యాప్తు సమర్థవంతంగా చేస్తారని మరీ కొనియాడారు.

చంద్రబాబు ఏ పని చేసినా అందులో తనకు నష్టమో, లేదా లాభమో ఉంటే తప్పా ఆయన నోటి నుంచి మాట రాదు. అలాగే సీబీఐకి నాడు నో చెప్పినా.. నేడు స్వాగతం చెప్పినా వాటి వెనుక బలమైన కారణాలున్నాయి. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయంలో అమరావతి భూ కుంభకోణాలు, అవినీతి, అక్రమాలతో చంద్రబాబు పాలన సాగింది. మొదటి నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంతో కలసి ఉన్నా.. చివరి ఏడాది తప్పుకున్నారు. అంతేకాదు.. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేసి సానుభూతి సంపాధించాలనుకున్నారు. తిరుపతికి వచ్చిన అమిత్‌ షా కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు.

ఈ క్రమంలో తన అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందన్న భయం చంద్రబాబులో నెలకొంది. అందుకే పలుమార్లు ప్రభుత్వ సభల్లోనూ, ఎన్నికల సభల్లోనూ ‘‘నా భవిష్యత్‌ మీ బాధ్యత, నేను జైలుకు పోకుండా మీరే కాపాడాలి’’అంటూ చంద్రబాబు ప్రజలను కోరారు. అందుకే ముందు జాగ్రత్తగా సీబీఐకి నో ఎంట్రీ బోర్టు పెట్టారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి స్వాగతాలు పలుకుతున్నారు.