iDreamPost
iDreamPost
ఒకనాడు తాను ముఖ్యమంత్రిగా కన్నా సీఈవో అని చెప్పుకోవడానికే ఇష్టపడతానని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రంలో వివిధ కార్పోరేట్ కంపెనీలకు అన్నీ అడ్డంకులు తొలగించేలా మార్పులు తీసుకొచ్చారు. చివరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో నిబంధనలు సడలించి వివిధ ప్రమాకర పరిశ్రమలకు కూడా అనుమతిచ్చిన ఘనత దక్కించుకున్నారు. ఇప్పుడు అవన్నీ మరచిపోయి పాలకపక్షాన్ని నిందించడానికి సిద్ధపడుతున్నారు. గురివిందను తలపించేలా ఉన్న చంద్రబాబు తీరు మీద ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ఆయన చేస్తున్న విన్యాసాలు బెడిసికొడుతున్నా పునరాలోచన చేయకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎల్జీ పాలిమర్స్ విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల ప్రకారం మల్టీ నేషనల్ కంపెనీ అయినంత మాత్రాన ప్రమాదకర రసాయన పరిశ్రమలను ఎలా అనుమతి ఇస్తారనే ప్రశ్న ఉదయిస్తోంది. చిన్న పాటి కేసులతో ఎలా సరిపెడతారనే అనుమానం వస్తుంది.
కానీ వాస్తవం ఏమంటే ఎల్జీ పాలిమర్స్ అనేది తెరమీదకు వచ్చిందే చంద్రబాబు అధికారంలో ఉన్నకాలంలో. తొలుత హిందుస్తాన్ పాలిమర్స్ గానూ, ఆ తర్వాత మెక్ డోవెల్స్ పేరుతో విజయ్ మాల్యా కంపెనీగానూ కొనసాగిన కంపెనీని 1998లో ఎల్జీ కంపెనీ టేకోవర్ చేసింది. అప్పట్లో ఈ కంపెనీలో జరిగిన ప్రమాదంపై స్థానికులు ఆందోళనకు కూడా దిగారు. పెద్ద స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ ని జనావాసాల నుంచి తరలించాలనే డిమాండ్ వచ్చింది. ఆ తర్వాత కూడా అనేక అభ్యంతరాలు వస్తూనే ఉన్నాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం వాటిని కప్పిపుచ్చి, స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిందన్నది కాదనలేని సత్యం.
అదే సమయంలో ఎల్జీ పాలిమర్స్ విస్తరణ కూడా బాబు హయంలోనే వేగంగా జరిగింది. కంపెనీ టేకోవర్ చేసే సమయానికి రోజుకి 71.5 టన్నుల ఉత్పత్తి కెపాసిటీ ఉన్న కంపెనీ 2004లో చంద్రబాబు గద్దె దిగేనాటికి 102 టన్నుల ఉత్పత్తి సామర్ధ్యాన్ని సాధించింది. ప్రజల అభ్యంతరాలు ఉన్నప్పటికీ, కెపాటిసీ పెంచుకునేందుకు బాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందనేది ఇక్కడ గమనార్హం. ఇక ఆ తర్వాత పదేళ్లలో 235 టన్నులకు పెరిగిన ఎల్జీ పాలిమర్స్ రోజువారీ ఉత్పత్తిని బాబు హయంలో 253 టన్నులకు పెంచుకున్నారు. 2006లో పర్యావరణ అనుమతులు లేకుండానే పెద్ద స్థాయిలో విస్తరణకు ఎల్జీ పాలిమర్స్ సిద్ధపడినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇక తాజాగా ఈ కంపెనీ నిబంధనలు ఉల్లంఘించినట్టు కేంద్ర పర్యావరణ శాఖ నిర్ధారించింది. పర్యావరణ అనుమతులు లేకుండానే కంపెనీ కార్యకలాపాలు కొనసాగించడం, సుప్రీంకోర్ట్ లో దాఖలు చేసిన అఫిడవిట్ కి భిన్నంగా వ్యవహరించడం వంటి లోపాలను కేంద్రం గుర్తించింది. వాటిపై తగు చర్యలకు పూనుకుంటోంది.
మరోవైపు సింహాచలం దేవస్థానం ట్రస్ట్ కి చెందిన 213 ఎకరాల భూమిని 1960లలో కంపెనీకి కేటాయించగా అందులో 162 ఎకరాలను రిజిస్టర్ చేసేందుకు వీలులేదు. అయితే 17 ఆగష్ట్ 2015లో చంద్రబాబు ప్రభుత్వం లో రెవెన్యూ శాఖ ఉత్తర్వులు విడుదల చేసి ఆ భూములను కూడా రిజిస్ట్రేన్స్ కి అనుమతించింది. దాంతో మొత్తం భూములను కంపెనీ యధేశ్ఛగా తన అవసరాలకు అనుగుణంగా మలచుకునే అవకాశం వచ్చింది. తద్వారా ఎల్జీ పాలిమర్స్ కి టీడీపీ హయంలో పెద్ద స్థాయిలో ప్రయోజనాలు దక్కినట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ ఆయన మాత్రం ఎదుటి పక్షాన్ని నిందించేందుకు ప్రయత్నించడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. తన వైఫల్యాలను, కంపెనీకి చేసిన ప్రయోజనాలను ప్రజలు గుర్తించకుండా చూసుకోవడానికే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారనే సందేహాలు బలపడుతున్నాయి.