చంద్రబాబు పై కేసు నమోదు

టీడీపీ అధినేత చిక్కుల్లో పడ్డారు. నిబంధనలు అతిక్రమించారంటూ ఆయనపై కేసు నమోదయ్యింది. కరోనా విస్తృతమవుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన చంద్రబాబు పై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసినట్టు ఏపీ పోలీసులు ప్రకటించారు. కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది.

విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాద బాధితులను పరామర్శించాలి అంటూ చంద్రబాబు అనుమతి తీసుకున్నారు. ఈనెల 25న ఆయన విశాఖ వెళ్లేందుకు ఏపీ డీజీపీ నుంచి అనుమతి వచ్చింది. అయితే విమాన సర్వీసులు ప్రారంభం కాకపోవడంతో ఆయన విశాఖ వెళ్లలేకపోయారు. అదే సమయంలో బాధితుల పరామర్శ కోసం తీసుకున్న అనుమతిని ఉపయోగించుకుని ఆయన ఏపిలో అడుగుపెట్టారు. రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి గరికపాడు చెక్ పోస్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కి వచ్చారు. చంద్రబాబు తోపాటుగా ఆయన తనయుడు నారా లోకేష్ సహా కొందరు అనుచరులు కూడా ఆయన వెంట ఉన్నారు.

ఆ సందర్భంగా చంద్రబాబు నిబంధనలు పాటించకుండా జనసమీకరణకు పూనుకోవడం విమర్శలకు దారితీసింది. ఏపీ హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలైంది. దానికి తోడుగా శ్రీనివాస్ అనే ఓ అడ్వొకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల వంటి చోట్ల చంద్రబాబు కి స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చట్టవ్యతిరేకమైన చర్యగా పేర్కొన్నారు. అంటువ్యాధుల నిరోధక చట్టం అమలులో ఉండగా గుమికుడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు బాధ్యుడు గా చంద్రబాబు పై చట్టపరంగా కేసు నమోదు చేయాలని కోరారు.

దాంతో చంద్రబాబు పై సెక్షన్ 188 ప్రకారం కేసు నమోదయ్యింది. దర్యఓ6చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పలువురు సామాన్యులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్న ఘటనలు ఉన్నాయి. లాఠీలకు పని చెప్పడం, వాహన సీజ్ వంటి చర్యలు తీసుకుంటున్నారు. కోర్టులు కూడా సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు పై కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది చర్చనీయాంశంగా మారింది.

Show comments