iDreamPost
android-app
ios-app

రాజ‌ధాని స‌మ‌స్య సామాన్యుడికి అవ‌స‌రం లేదు

రాజ‌ధాని స‌మ‌స్య సామాన్యుడికి అవ‌స‌రం లేదు

పులిని చూసి న‌క్క వాత పెట్టుకున్న‌ట్టు, హైద‌రాబాద్‌ను చూసి చంద్ర‌బాబు అమ‌రావ‌తి వాత పెట్టుకున్నాడు. ఆయ‌న‌కు పోయిందేమీ లేదు కానీ, రైతుల‌కి బొబ్బ‌లెక్కి ఒళ్లు కాలింది. హైద‌రాబాద్‌కి వంద‌ల ఏళ్ల చ‌రిత్ర ఉంది. రాజ‌ధాని కాక ముందే అదో పెద్ద న‌గ‌రం. త‌ర్వాత వ‌ల‌స‌లు పెర‌గ‌డం, విద్య‌, ఉపాధి కోసం ల‌క్ష‌ల మంది వ‌చ్చి చేర‌డంతో దేశంలోనే పెద్ద న‌గ‌రాల్లో ఒక‌టిగా మారింది.

పాల‌కుల త‌ప్పు ఏమంటే హైద‌రాబాద్ అభివృద్ధిని మాత్ర‌మే దృష్టిలో ఉంచుకుని ఉమ్మ‌డి రాష్ట్రంలోని అన్ని ప‌ట్ట‌ణాల‌ను నిర్ల‌క్ష్యం చేశారు. ఆంధ్ర రాష్ట్ర‌మే కాదు, తెలంగాణ ఈ ఫ‌లితాన్ని అనుభ‌వించింది. హైద‌రాబాద్ త‌ప్పితే, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, క‌రీంన‌గ‌ర్‌, అన్నీ సాదాసీదా న‌గ‌రాలే త‌ప్ప‌, అక్క‌డేం పెద్ద‌గా ప‌రిశ్ర‌మ‌లు , ఉపాధి అవ‌కాశాలు లేవు.

అదే విధంగా విజ‌య‌వాడ‌, గుంటూరు, క‌ర్నూలు దాదాపు అన్నీ అర‌కొర‌గా త‌ప్ప పెద్ద‌గా అభివృద్ధి చెందింది లేదు. పోర్ట్‌, ఉక్కు ఉండ‌డంతో వైజాగ్ కాస్త పెద్ద న‌గ‌రంగా ఎదిగింది. అంతే త‌ప్ప అది పాల‌కుల ఘ‌న కార్యం కాదు. ముఖ్యంగా గోదావ‌రి, కృష్ణా, గుంటూరు ప్రాంతాల నుంచి వ‌చ్చే వ్య‌వ‌సాయ ఆదాయాన్ని హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెట్టారే త‌ప్ప‌, సొంత ప్రాంతాల‌కి నాయ‌కులూ చేసిందీ లేదు, స్థానికంగా ఉన్న ధ‌న‌వంతులు ప‌ట్టించుకుంది లేదు. ఇక సీమ‌లో అయితే మ‌రీ ఘోరం. అనంత‌పురంలో ఇప్ప‌టికీ న‌డిరోడ్ల మీద పందులు తిరుగుతూ ఉంటాయి. (ఈ మ‌ధ్య క‌లెక్ట‌ర్‌కి స్వ‌చ్ఛ భార‌త్ అవార్డు కూడా ఇచ్చారు) క‌డ‌ప ప‌ట్ట‌ణంలో రాజశేఖ‌ర‌రెడ్డి బ్రిడ్జిలు క‌ట్టించ‌క‌పోతే వ‌ర్షాకాలంలో ఇళ్ల‌లోకి నీళ్లు వ‌చ్చేవి.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోకుండా అమ‌రావ‌తి అనే రియ‌ల్ ఎస్టేట్ గేమ్ ఆడాడు. ఐదేళ్ల‌లో ఎలాంటి చిత్త‌శుద్ధి లేకుండా గ్రాఫిక్స్ చూపించారు. రైతుల నుంచి భూమి సేక‌రించి, అభివృద్ధి చేసి అద్భుత న‌గ‌రంగా మారుస్తాన‌ని డంబాలు ప‌లికాడు. ఉపాధి ఉంటేనే ల‌క్ష‌లాది మంది వ‌చ్చి నివాసం ఉంటారు. అంతే కానీ నాలుగు బిల్డింగులు క‌ట్టి వెయ్యి మంది కూలీలు వ‌చ్చి పోతూ ఉంటే న‌గ‌రాలు ఏర్ప‌డ‌వు. రైతులు కూడా ఏదో జ‌రుగుతుంద‌ని ఆశ ప‌డ్డారు, దీంట్లో త‌ప్పేం లేదు. అయితే రైతుల ముసుగులో చాలా మంది రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా దిగారు. వాళ్లు న‌ష్ట‌పోతార‌నే అంద‌రి బాధ‌.

ఇప్పుడు జ‌గ‌న్ వైజాగ్ అంటున్నాడు. సెక్ర‌టేరియ‌ట్‌, కొన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు త‌ర‌లిపోతే వైజాగ్‌లో కూడా అద్భుతాలేమీ జ‌ర‌గ‌వు. అద్భుతాలు ఎప్పుడు జ‌రుగుతాయంటే, పెట్టుబ‌డులు పెరిగిన‌ప్పుడు. జ‌గ‌న్ ఆ దిశ‌గా అడుగులేసి అభివృద్ధిని వికేంద్రీక‌రించాలి. రాజ‌ధాని త‌ర‌లిపోతే అమ‌రావ‌తి అడ‌విగా, ఎడారిగా మారుతుంద‌ని క‌థ‌నాలు. ఇప్పుడు మాత్రం సుంద‌ర‌న‌గ‌రంగా ఉందా ఏంటి?

అమ‌రావ‌తి మీద ల‌క్ష కోట్లు పెట్టే ఆర్థిక స్థితి లేద‌ని జ‌గ‌న్ అంటున్నాడు. ఇది వాస్త‌వం. ఉన్న నిధులు సంక్షేమ ప‌థ‌కాల‌కి స‌రిపోతున్నాయి. (విమ‌ర్శలు ఎన్ని ఉన్నా, అట్ట‌డుగు వ‌ర్గాల జీవ‌న‌స్థాయి మెరుగు చేయ‌డానికి జ‌గ‌న్‌లా కృషి చేస్తున్న వాళ్లు ప్ర‌స్తుతం దేశంలో ఎక్క‌డా లేరు. దీన్ని మంచీచెడ్డ‌ల్ని కాలం నిరూపిస్తుంది)

భూముల‌కి రియ‌ల్ ఎస్టేట్ విలువ వ‌స్తే ల‌క్ష కోట్లు అవే వ‌స్తాయ‌ని బాబు అంటున్నాడు. హైద‌రాబాద్‌ని చూసిన క‌ళ్ల‌తో అమ‌రావ‌తిని చూస్తే అంచ‌నాలు ఇలాగే ఉంటాయి. హైకోర్ట్‌, సెక్ర‌టేరియ‌ట్‌ల‌తో న‌గ‌రాలు ఏర్ప‌డ్డం నిజ‌మే అయితే రాయ్‌పూర్‌, గాంధీన‌గ‌ర్‌లు ఎప్పుడో న‌గ‌రాలుగా మారేవి.

ఇక రైతుల ఆందోళ‌న‌ని కూడా జ‌గ‌న్ అర్థం చేసుకుని న‌ష్టం ఎక్క‌డ జ‌రిగిందో విచారించి, ప‌రిహారం కూడా చూడాలి. వైజాగ్ చాలా దూరం అని ప‌త్రిక‌ల్లో కిలోమీట‌ర్ల లెక్క‌లు వేస్తున్నారు. పైర‌వీకారులు, ద‌ళారుల‌కి త‌ప్ప రాజ‌ధానికి త‌ర‌చుగా వెళ్లాల్సిన అవ‌స‌రం సామాన్యుల‌కి ఎప్పుడూ ఉండ‌దు.

రాజ‌ధాని సామాన్యుల స‌మ‌స్య కాదు కాబ‌ట్టే ఆ ఆందోళ‌న‌ను రాష్ట్రంలోని మిగతా ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు.