Idream media
Idream media
అత్యంత ప్రమాదకరమైన జబ్బుల్లో క్యాన్సర్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలు ఏటికేడూ పెరుగుతూనే ఉన్నాయి. మనిషి శరీరంలోని ముఖ్యమైన భాగాల్లోని కణజాలాన్ని నాశనం చేసి చావుకు దగ్గరకు చేస్తుంది. క్యాన్సర్ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం కావడం వల్ల మరణాల శాతం అధికంగా ఉంటోంది. మరీ ముఖ్యంగా భారతదేశంలో క్యాన్సర్ ఈ దశాబ్ధంలో విజృంభిస్తోంది. ఒక్క 2018 సంవత్సరంలోనే కొత్తగా 11.6 లక్షల మంది క్యాన్యర్ వ్యాధిగ్రస్తులు నమోదైనట్లు తేలింది. పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా ఈ మహమ్మారి కనిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో– వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ఒక నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. సగటున ప్రతి 10 మంది ఇండియన్స్‌లో ఒకరు జీవితంలో క్యాన్యర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయనే చేదు నిజాన్ని బయటపెట్టింది. అందులోనూ ప్రతి 15 మందిలో ఒకరు చనిపోయే ఆస్కారం ఉందని తెలిపింది. సామాజికంగా, ఆర్థికంగా దేశంలో చోటు చేసుకుంటున్న మార్పులు క్యాన్సర్ పెరుగుదలకు కారణమని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. పొగాకు ఉత్పత్తుల వాడకంతోనే ఎక్కువ మంది ఈ రోగం బారిన పడుతున్నారని పేర్కొంది.
భారత్‌లో 2018లో కొత్తగా 11.6 లక్షల మంది క్యాన్సర్ బారిన పడితే వారిలో మహిళలు 5.9 లక్షలు, పురుషులు 5.7 లక్షల మంది ఉన్నారని తెలిపింది. మహిళల్లో అత్యధికంగా రొమ్ము క్యాన్సర్ బారిన 1.62 లక్షలు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన 97 వేల మంది, అండాశయ క్యాన్సర్ బారిన 36 వేల మంది, నోటి క్యాన్సర్ బారిన 28 వేలు, పెద్ద పేగు క్యాన్సర్ బారిన 20 వేల మంది పడినట్లు తేల్చింది. పురుషుల్లో నోటి క్యాన్సర్‌కు 92 వేల మంది, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు 49 వేల మంది, ఉదరవాహిక క్యాన్సర్‌కు 39 వేల మంది, పెద్దపేగు క్యాన్సర్‌కు 37 వేల మంది, అన్నవాహిక క్యాన్సర్ బారిన 34 వేల మంది పడినట్లు తేల్చింది. క్యాన్సర్‌తో ఇప్పటివరకు దాదాపు 7.50 లక్షల మంది చనిపోయారని నివేదికలో వెల్లడించింది.
ఏపీలో క్యాన్సర్ రోగులకు ఉచిత చికిత్స
ఆంధ్రప్రదేశ్‌ను సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ పరిధిలోకి 1.43 కోట్ల కుటుంబాలను చేర్చింది. ఇందులో ప్రాణాంతక వ్యాధిౖయెన క్యాన్సర్‌కు ఉచితంగా చికిత్స చేయించాలని నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో చాలా మంది ప్రాథమిక స్థాయిలో జబ్బును గుర్తించడం ఆలస్యం కావడం వల్లే మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని తేల్చింది. ఇందుకోసం గ్రామాల్లో డాక్టర్ల సమన్వయంతో రోగులకు గుర్తించి చికిత్స అందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. త్వరలో పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది.