iDreamPost
iDreamPost
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం వీరసింహారెడ్డిపై విడుదలకు ముందు ఎప్పుడూ లేనంత హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయమనే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే తగ్గట్లే ఈ చిత్రం మొదటి రోజు బాలయ్య కెరీర్ లోనే రికార్డు ఓపెనింగ్స్ తో సత్తా చాటింది. కానీ ఊహించని విధంగా రెండో రోజు నుంచే కలెక్షన్లు దారుణంగా డ్రాప్ అయ్యాయి. దీంతో బిగ్గెస్ట్ హిట్ సంగతి తర్వాత.. అసలు ముందు బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జనవరి 12న విడుదలైన వీరసింహారెడ్డి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.30 కోట్ల షేర్ రాబట్టింది. బాలయ్య కెరీర్ లో ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం ఇదే మొదటిసారి. అయితే ఆ ఆనందం ఒక్కరోజు కూడా నిలవలేదు. రెండో రోజు నుంచి కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. వీరసింహారెడ్డి రొటీన్ ఫ్యాక్షన్ ఫిల్మ్ అనే టాక్ తెచ్చుకుంది. పైగా మితిమీరిన వైలెన్స్ ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. దీనికి తోడు రెండో రోజైన జనవరి 13 నుంచి వాల్తేరు వీరయ్య ప్రభంజనం మొదలైంది. వింటేజ్ చిరంజీవిని చూడటానికి ఫ్యాన్స్ తో పాటు మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ సైతం థియేటర్లకు కదులుతున్నారు. దీంతో వీరసింహారెడ్డి థియేటర్లు తగ్గిపోతుండటంతో పాటు.. వసూళ్లు దారుణంగా పడిపోయాయి.
మొదటి రోజు 30 కోట్ల షేర్ తో సత్తా చాటిన వీరసింహారెడ్డి.. రెండో నుంచి 6-8 కోట్ల షేర్ రేంజ్ కి పడిపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో 52 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. వీరసింహారెడ్డి ముందు బ్రేక్ ఈవెన్ లక్ష్యం భారీగా ఉంది. ఇప్పటిదాకా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అఖండ ఫుల్ రన్ లో 75 కోట్ల షేర్ రాబడితే.. వీరసింహారెడ్డి బిజినెస్సే అంత మొత్తంలో జరగడం విశేషం. అంటే వీరసింహారెడ్డి హిట్ అనిపించుకోవాలి అంటే ఇంకా 23 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులు వీరసింహారెడ్డికి అనుకూలంగా లేవు. ఓ వైపు సంక్రాంతి సందడి ముగింపుకి వచ్చింది, మరోవైపు వాల్తేరు వీరయ్య కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇలాంటి సమయంలో వీరసింహారెడ్డి బ్రేక్ ఈవెన్ సాధించడం అనుమానమే అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.