iDreamPost
android-app
ios-app

బిజెపి ను కలవర పెడుతున్న సి ఓటర్ సర్వే!

బిజెపి ను కలవర పెడుతున్న సి ఓటర్ సర్వే!

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు విడుదల అయిన వేళ కమల దళంలో కొత్త కలవరం మొదలైంది. ఏబీపీ సీ – ఓటర్ ఒపీనియన్ పోల్ లో బిజెపి కు మింగుడుపడని విషయాలు బయటకు వచ్చాయి.

బెంగాల్ దీదీ దే!

బెంగాల్ ప్రజలు దీదీ మమతా వైపే ఉన్నారని ఈ ఒపీనియన్ పోల్లో స్పష్టమైంది. అలాగే తమిళనాడులోనూ డీఎంకె, కాంగ్రెస్ పార్టీలు సత్తా చూపుతానని తేలింది. ఇక కేరళలో ప్రాపకం కోసం పాకులాడుతున్న బిజెపి కు అక్కడ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న అసోంలో మాత్రమే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు బిజెపికి ఉన్నాయని ఒపీనియన్ పోల్ లో బయట పడింది. ఇక కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లోనూ మంచి ఫలితాలు బిజెపికి వచ్చే అవకాశం ఉందని ఒపీనియన్ పోల్ లో తేల్చడం కాస్త ఊపిరి ఆడే విషయం. 

ఏది ప్రభావం.. 

పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఈ సారి జరగబోయే ఎన్నికల్లో 148 నుంచి 160 సీట్లు సాధించి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఒపీనియన్ పోల్లో తేలింది. బిజెపి బెంగాల్లో 92 నుంచి 108 సీట్ల మధ్యలో గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తేలింది.

తమిళనాడులో అన్నా డీఎంకే నేతృత్వంలో ఉన్న బిజెపి కు గట్టి దెబ్బ తగులుతుందని సి ఓటర్ సర్వే లో తేలింది. అన్నాడీఎంకే బీజేపీ కూటమి కి 58 నుంచి 66 మధ్య సీట్లు వచ్చే అవకాశం ఉందని, డిఎంకె 154 నుంచి 162 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని పేర్కొంది.

కేరళలోనూ బిజెపి ఏ మాత్రం ఈసారి ప్రభావం చూపక పోవచ్చని అక్కడ అధికారంలో ఉన్న వామపక్ష కూటమి మరోసారి అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉందని తేలింది. సిపిఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్ 83 నుంచి 91 సీట్లు వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 47 – 55 మధ్యలో సీట్లు రావచ్చని బీజేపీ మాత్రం కేవలం రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని తేలింది.

అసోంలో మాత్రం బీజేపీకి అనుకూల ఫలితాలు రావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న బిజెపి మరోసారి దాన్ని నిలబెట్టుకోవచ్చని సర్వే ఫలితాలు వచ్చాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 72 సీట్ల వరకు రావచ్చు అని, కాంగ్రెస్ కూటమి కు 41 నుంచి 47 మధ్య సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.

పుదుచ్చేరి అసెంబ్లీలో బిజెపి ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది అనేది సి ఓటర్ సర్వే రిపోర్ట్. అక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమయ్యే 17 నుంచి 21 సీట్లను బిజెపి గెలుచుకోవచ్చు అని, కాంగ్రెస్ 12లోపు సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

మొత్తానికి ఎన్నికల ముందు సి ఓటర్ సర్వే బెంగాలీ ఫలితాల్లో బీజేపీ కు మింగుడుపడని అంశాన్ని చెప్పినట్లే. బెంగాల్ తో పాటు తమిళనాడులోనూ ప్రభావం చూపాలని గట్టిగా భావిస్తున్న కాషాయం పార్టీకి ఈ సి ఓటర్ సర్వే ఫలితాలు ఇప్పుడు కొత్త భయాలను కలిగిస్తున్నాయి.