Idream media
Idream media
బాలకృష్ణ గర్జన మళ్లీ వినపడింది. యూట్యూబ్ భూకంపం వచ్చినట్టు వికలమైంది. బాలయ్య వస్తూ ఉంటే నేల దద్దరిల్లి, దుమ్ము లేచింది. ఎలక్ట్రిక్ రంపాలతో కొందరు ఆయన మీదికి వెళ్తున్నారు. వాళ్లకు బాలయ్య సంగతి తెలియదు. ఆయన తొడ కొడితే ప్యాంట్ మీద లేచిన దుమ్ము, రంపపు పొట్టు కంటే ప్రమాదం. ప్రేక్షకులు ఎన్నోసార్లు ఆ రంపపు కోత భరించారు.
ఈ సీన్ తర్వాత ఎవడికో నీతి బోధ చేస్తారు. మాట్లాడే పద్ధతి గురించి చెప్పి ‘‘లండీ కొడకా’’ అని ముగిస్తాడు. బోయపాటి గొప్ప డైరెక్టర్. ఆయన సైన్స్ సూత్రాలని , గ్రావిటీని తిరగరాస్తాడు. రౌడీలు గాలిలోకి లేచి భూమికి తగిలి, మళ్లీ బాల్‌లా పైకి లేచి కిందపడతారు. వినయవిధేయ సినిమాలో ఒకన్ని నరికితే , ఆ తల గాల్లోకి లేస్తే ఒక పక్షి వచ్చి ఎగరేసుకుపోతుంది. తెలుగు వాళ్లు కరోనాని తట్టుకోగలుగుతున్నారంటే ఇలాంటి సినిమాలు చూడడం వల్లే.
దేవుడి దయ వల్ల థియేటర్లు ఇప్పట్లో తెరవరు కాబట్టి భయపడాల్సింది ఏమీ లేదు. లేదంటే థియేటర్లలో Exit Door కోసం తొక్కిసలాట జరిగి అనేక మంది గాయపడేవాళ్లు.
ఈ టీజర్ షాక్ నుంచి కోలుకునే లోగా ఎవరో మిత్రులు బాలయ్య పాడిన శివశంకరి పాట లింక్ పంపారు. పాటకి రాళ్లు కరుగుతాయని తెలుసు కానీ, రాళ్లే మీద పడతాయని తెలియదు. జగదేకవీరుని కథ సినిమాలో ఘంటశాల పాటకి బదులు దీన్ని వాడి ఉంటే , రాయిగా మారిన ముని , బాలకృష్ణ కాళ్లావేళ్లా పడి , ఈ కొత్త శిక్ష నుంచి తనని రక్షించమని వేడుకునే వాడు.
బాలయ్య బాబు , 40 ఏళ్లుగా ఒకటే రకం యాక్షన్ చేస్తున్నా భరించాం. ఏదో పెద్దాయన కొడుకు కదా అని అభిమానుల్ని వెంటపడి తంతే భరించాం, ఏదో ఆవేశం అనుకుని స్టేజీ మీద పాట పాడితే టీవీ ఆఫ్ చేసుకున్నాం కానీ, నిన్నేమైనా అన్నామా?
కరోనా వచ్చి కష్టాల్లో ఉన్నాం. బయటికెళితే ముక్కుకి మాస్క్ వేసుకోవాలి. ఇప్పుడు చెవులకి కూడా మాస్క్‌లేసుకుని ఎక్కడ తిరిగేది?
చైనా అధ్యక్షున్ని కట్టేసి నీ పాట రిపీటెడ్‌గా వినిపిస్తే అసలు కరోనా ఎక్కడ పుట్టిందో చెప్పేస్తాడు. సరిహద్దుల్లో చైనా సైన్యం మోహరించి ఉందట. అక్కడ డీజే సౌండ్‌తో నీ పాట వినిపిస్తే మళ్లీ ఎప్పుడైనా జన్మలో మన వైపు వస్తారా?
అసలు జగన్ అమాయకుడు కాబట్టి, చంద్రబాబు తన ప్రత్యర్థి అనుకుంటూ ఉంటాడు. ఒకసారి మీ బావ చంద్రన్నకి శివశం..కరి శివానందలారీ అని మీ పాట వినిపిస్తే, ఇంకెప్పుడైనా క్రియాశీల రాజకీయాల వైపు వస్తాడా?
గానం కూడా ఒక ఆయుధమని నిరూపించావే! కరోనా రోగం కూడా సృష్టించలేనంత భయోత్పాతాన్ని ఒక రాగంతో సృష్టించావే. ఘంటశాల బతికి ఉంటే తబలాతో తల బాదుకునేవాడే.
ఎందుకయ్యా , మా మీద పగ.
ఇంకా నీ సినిమాలు చూస్తున్నందుకా?
నిన్నటి నుంచి కేసులు పెరిగాయని ENT డాక్టర్లు సంతోషిస్తున్నారట.
వదిలేయ్ బాలయ్యా…మా బతుకు మేం బతుకుతాం… మా చావు మేమే చస్తాం…నువ్వు చంపకు.
Link Here @ bit.ly/2XLf1L4