iDreamPost
android-app
ios-app

సుశాంత్ వెనుక బాలీవుడ్ చీకటి కోణం

  • Published Jun 16, 2020 | 5:33 AM Updated Updated Jun 16, 2020 | 5:33 AM
సుశాంత్ వెనుక బాలీవుడ్ చీకటి కోణం

మొన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయిన బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పుడప్పుడూ సినిమాలు చూసే ప్రేక్షకులు సైతం ఇతని కథను విని కదిలిపోతున్నారు. కాయ్ పో చే, ఎంఎస్ ధోని లాంటి సూపర్ హిట్ క్లాసిక్స్ తో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ దక్కించుకున్న సుశాంత్ ఇంత చిన్న వయసులో కన్ను మూయడం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా ఇంకా ఆ జ్ఞాపకాల నుంచి ఎవరూ బయటికి రావడం లేదు. అయితే కొన్ని నేషనల్ మీడియా సైట్స్ లో వస్తున్న కథనాలు సుశాంత్ మరణం వెనుక గల చీకటి కోణాలను ప్రశ్నిస్తున్నాయి. ఇతని ఎదుగుదలని ఓర్వలేకే కరణ్ జోహార్, యష్ ఫిలిమ్స్, సల్మాన్ ఖాన్ పిక్చర్స్ లాంటి బడా నిర్మాణ సంస్థలు సుశాంత్ మీద అప్రకటిత నిషేధాన్ని విధించాయని, అది కూడా అతని కుంగుబాటులో బలమైన కారణంగా నిలిచిందని చెబుతున్నారు.

వస్తున్న అవకాశాలను తెరవెనుక కథ నడిపించి ఆపేయడం, ఉన్నట్టుంది ఆఫర్లని వెనక్కు తీసుకోవడం లాంటివి చాలానే జరిగాయట. ఆ మేరకు ఓ మీడియా సంస్థ ఫిబ్రవరిలో ట్వీట్ చేసిన సుశాంత్ బ్యాన్ న్యూస్ ఇప్పుడు వైరల్ టాపిక్ గా మారింది. ఇదంతా నిజంగా జరిగిందా అంటే అధిక శాతం ఔననేలాగే పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రఖ్యాత దర్శకుడు శేఖర్ కపూర్ తన ప్రతిష్టాత్మక చిత్రం పానీలో హీరోగా సుశాంత్ నే తీసుకున్నారు. బడ్జెట్ కారణాలతో దీనికి నిర్మాతలు మారారు. ఆఖరికి యష్ సంస్థ ఒప్పుకుంది. కానీ కొంత కాలం అయ్యాక అదీ తప్పుకుంది. ఏదో విధంగా కొనసాగించేందుకు శేఖర్ కపూర్ ప్రయత్నాలు చేస్తున్నా అవీ ఫలించలేదు. దీని వెనుక ఏదో మాఫియా ఉందన్న అనుమానాలు అప్పట్లోనే వచ్చాయి.

నిన్న కంగనా రౌనత్ ఇండస్ట్రీలో ఉన్న దారుణ పరిస్థితుల గురించి నిలదీస్తూ విడుదల చేసిన వీడియో కూడా వీటికి బలం చేకూరుస్తోంది. సుశాంత్ చివరి చూపుకు పరిశ్రమ పెద్దలని చెప్పుకునే వారెవరూ ఎక్కువగా రాకపోవడం ఆలోచింపజేసేదే. సుశాంత్ ది ఆత్మహత్య కాదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉరి వేసుకోవడం స్పష్టంగా ఉంది కాబట్టి పోలీసులు సైతం ఎక్కువగా ఏమి చేయలేని పరిస్థితి. మాజీ గర్ల్ ఫ్రెండ్స్ వ్యవహారం, లవ్ ఫెయిల్యూర్, బాలీవుడ్ మాఫియా వీటిలో కారణం ఏదో తెలియక సుశాంత్ ఫ్యాన్స్ తల్లడిల్లిపోతున్నారు. ఇతని ఆఖరి సినిమా దిల్ బేచారా ఓటిటి రిలీజ్ కు రెడీగా ఉంది. ఇది కాకుండా నిర్మాణంలో ఉన్న పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడం ఆలోచించాల్సిన విషయం. పోయిన ప్రాణం తిరిగి రాదు కాని చాలా విషయాల్లో లోతైన ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం బాలీవుడ్ కు ఇప్పుడు చాలా ఉంది .