iDreamPost
android-app
ios-app

ఆ అవకాశం కూడా లేకుండా చేసేట్టున్నారే..

  • Published Dec 15, 2020 | 3:30 AM Updated Updated Dec 15, 2020 | 3:30 AM
ఆ అవకాశం కూడా లేకుండా చేసేట్టున్నారే..

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో ఒక్కో పార్టీకి ఒక్కో బలమైన అవకాశం ఉందనే చెప్పాలి. సంక్షేమ పథకాలు అధికార వైఎస్సార్‌సీపీకి ఉన్న అవకాశంగా చెప్పొచ్చు. కేంద్రంలో అధికారంలో ఉండడం బీజేపీకి అవకాశం కాగా, తెలుగుదేశం పార్టీకి మాత్రం అమరావతే ఒక్కగానొక్క అవకాశంగా కన్పిస్తోంది. ఈ అవకాశాన్నే రాచబాటగా చేసుకుని ప్రజల ముందుకు వెళ్ళేందుకు అనేక వ్యూహలను పన్నుతుంటాయి ఆయా పార్టీలు.

ఆయా పార్టీలు తమకు లభిస్తున్న అవకాశాలను బట్టి ఆయా అంశాలకు మరిన్ని కొత్తవాటిని జోడించుకుంటూ ముందుకెళ్ళే ఆలోచనలు చేస్తుంటాయి. అయితే గత యేడాదిన్నరగా లేని అమరావతిని ఆధారంగా చేసుకుని పోరాడుతున్నది నారా చంద్రబాబునాయుడి నేతృత్వంలోనే తెలుగుదేశం పార్టీయేనని చెప్పాలి. అధికారం చేతిలో ఉన్నప్పుడు చేయాల్సిన పని చేయకపోగా, ఇప్పుడు అదొక అద్భుత నగరమని, దాన్ని మించింది ఏమీ లేదని నిత్యం బాబు అండ్‌ బృందం పొగుడుతూనే ఉంటుంది. ఆఖరికి పార్లమెంటుకు శంకుస్థాపన సమయాన్ని పురస్కరించుకుని ప్రధానికి శుభాకాంక్షలు చెబుతూ కూడా అమరావతిలో తాను రూపొందించి ప్లాన్‌లను గురించి చంద్రబాబు గుర్తు కూడా చేసుకున్నారు.

అయితే ఇప్పుడు అమరావతిలో నూతన వ్యవసాయ బిల్లుకు మద్దతుగా భారతీయ కిసాన్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రకటించేసారు. పైగా ప్రధాన మంత్రి మనిషిగా తాను చెబుతున్నానంటూ బల్లను కూడా గుద్దేసారు.. ఈ మాటలు విన్న కొందరు వెంటనే అవాక్కయ్యారు. ఆ తరువాత తేరుకుని చప్పట్లు కూడా కొట్టేసారు.

ఇంత వరకు బాగానే ఉంది గానీ, నిన్న మొన్నటి వరకు ఏపీ బీజేపీ మాట్లాడిన మాటలకు, తాజాగా మాటలకు తేడా కన్పించడంతో దీని వెనుక ఉన్న అంతరార్ధం ఏంటా? అని విశ్లేషకులు శోదన మొదలెట్టేసారు. దీంతో అసలు విషయం బైటపడుతోంది. అమరావతి పోరాటాన్ని స్వయంగా తెలుగుదేశం పార్టీ, వారికి అనుబంధంగా ఉన్న కొన్ని శక్తులు భుజానికెత్తుకుని ముందుకు నడిపిస్తున్నాయన్నది ఇప్పటికే పలురు వ్యక్తం చేసిన భావన. దీనిని నిజం చేస్తున్న విధంగానే చంద్రబాబు కూడా వ్యవహరిస్తుండడాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గుర్తించకమానలేదు. అంటే ఒక రకంగా అమరావతి ఉద్యమం పేరిట సాగుతున్న వ్యవహారానికి అప్రకటిత బ్రాండ్‌ అంబాసిడర్‌గా తెలుగుదేశం పార్టీయే ఇప్పటి వరకు ఉంది.

తాజాగా సోము వీర్రాజు ప్రకటనతో సదరు వ్యవహారం ద్వారా వచ్చే ప్రయోజనంలో వాటాకు బీజేపీ కూడా వచ్చినట్టయిందంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో ఏ చిన్న అవకాశాన్నైనా వదిలి పెట్టకూడదన్న కృతనిశ్చయంతో ఉన్న బీజేపీ ఈ విధంగా వ్యవహరించడంలో పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదని వారు తేల్చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అమరావతిపై మాట్లాడే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ మాత్రమే ఏకపక్షంగా వినియోగించేసుకుంటోంది. ఇక ఇప్పటి నుంచి బీజేపీ కూడా సదరు వినియోగంలో వాటాకొస్తుందని వివరిస్తున్నారు. తద్వారా ఏపీలో తెలుగుదేశం పార్టీ మాట్లాడే ఏకైక అవకాశంగా ఉన్న అమరావతిని అంశానికి కూడా బీజేపీ ఎసరు పెట్టేసినట్టేనని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా బీజేపీ ఏపీలో తన లక్ష్యంగా ప్రకటించుకున్న స్థానానికి చేరేందుకు లోతుగానే కృషి చేస్తున్నట్లుగా తాజాగా సోము చేసిన ప్రకటనలో భావించాల్సి వస్తోందంటున్నారు.