అమరావతిపై బీజేపీ అధిష్టానం వైఖరి ఏంటి ?

అధికార పక్షం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బిల్లుతో రాజధాని వికేంద్రీకరణ జరుగుతుందనే విషయంపై స్పష్టత వచ్చింది. ఈ సందర్భంగా కొంతమంది రాష్ట్రంలోని బీజేపీ వాదులు , జనసేన నేత పవన్ కళ్యాణ్ అమరావతిని చీల్చి రాష్ట్రానికి మూడు రాజధానులు తీసుకువస్తే కేంద్రం చూస్తు ఊరుకోదని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఏకంగా డిల్లీకి వెళ్ళి నేను కేంద్రంతో మాట్లాడి అమరావతే రాజధానిగా ఉండేలా చేస్తానని చెప్పుకొచ్చారు. రాజధాని విషయంలో జనసేనలో, బీజేపీలో మొదటి నుండీ భిన్న స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒక వర్గం బీజేపీ రాజధాని మార్పు రాష్ట్ర పరిధిలోని అంశం అంటే తెలుగుదేశం నుండి బీజేపీలోకి వెళ్ళిన మరికొంతమంది మాత్రం రాజధాని మార్పును కేంద్రం ఒప్పుకోదని చెప్పుకొస్తున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రాజధానులని వ్యతిరేకిస్తుంటే ఆ పార్టీ తరుపున గెలిచిన ఏకైక శాసన సభ్యుడు రాపాక వరప్రసాద్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నిర్ణయానికి మద్దతుగా ఓటు వేశారు. ఈ సందర్భంలో రాజధాని అంశంపై బీజేపీ అధిష్టానం అభిప్రాయం ఏంటనే చర్చ జోరందుకుంది.

బీజేపీ వైఖరి ఏంటి? మ్యానిఫెస్టోలో ఏం చెప్పింది?

భారతీయ జనతా పార్టి 2019 ఎన్నికల మ్యానిఫెస్టొలో దశల వారి మధ్య నిషేధం, పార్లమెంట్ వారీగా జిల్లాల విభజన, అమరావతి భూములు కుంభకోణంపై విచారణ జరిపి భూములు తిరిగి రైతులకు ఇచ్చివేస్తాం, హై కోర్టుని రాయలసీమలో ఏర్పాటు చేస్తాం అంటూ హామీలు ఇచ్చారు. ఇవే హామీలు వై.యస్ జగన్ 2014 నుండి చెప్పుకుంటూ వచ్చి 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. ఇప్పుడు అవే హమీలు నెరవేర్చడంలో భాగంగా రాజధాని ప్రాంతంలోని భూములు కుంభకోణాలను వెలికితీస్తూ, భూములు క్రమబద్దీకరణ చేసే పని చేస్తున్నారు. అలాగే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు సిద్దమయ్యారు. ఇక పోతే బీజేపీ తన మ్యానిఫెస్టొలో అధికారం అనేది ప్రస్తుతానికి ఢిల్లీలో, రాష్ట్ర రాజధానుల్లో ఉందని, భారతీయ జనతా పార్టీ పరిపాలన వికేంద్రీకరణను జరిగితేనే అభివృద్ది జరుగుతుందని నమ్ముతుందని చెప్పుకొచ్చారు. వై.యస్ జగన్ కూడా అమరావతిని శాసన రాజధానిగా ఉంచుతూ, దీంతో పాటు వెనకపడ్డ ఉత్తరాంధ్ర , రాయలసీమకు న్యాయం జరిగేలా విశాఖను అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటిల్ గా, కర్నూల్ ను న్యాయశాఖ రాజధానిగా చేస్తూ పరిపాలను వికేంద్రికరిస్తూ అన్ని ప్రాంతాలకు అభివృద్ది ఫలాలు అందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.

బీజేపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జి.వి.యల్ నరసింహారావు కూడా ఐదేళ్ళపాటు చంద్రబాబు రాజధాని పేరు మీద గ్రాఫిక్స్ చూపించారని, చంద్రబాబు రాజధానిలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చెప్పలేదని, రాజధాని ఎంపిక అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని , ప్రజా అవసరాలకొసం రాజధానిని మారుస్తామంటే కేంద్రం అడ్డుకోదని గతంలొనే చెప్పుకొచ్చారు. మొదట రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించినా, తరువాత రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని తేల్చి చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే సుజనా చౌదరి లాంటి తెలుగు దేశం నుండి పార్టీ మారి బీజేపీ కండువా కప్పుకున్న వ్యక్తులు, కొత్తగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న జనసేన పవన్ కళ్యాణ్, ప్రజలని తప్పుదోవ పట్టించే విధంగా బీజేపి అధిస్టానం ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు వ్యతిరేకిస్తుందని చెబుతూ తెలుగుదేశం అజెండాని భుజాన మోస్తున్నారా అనే అనుమానం వచ్చేలా మాట్లాడుతున్నారు. తమ రాజకీయ మనుగడ కోసమే ఇలా పచ్చ బీజేపీ నేతలు అశాంతిని సృష్టించే వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయం రాష్ట్రంలోని మెజారిటి జిల్లాల్లో వ్యక్తం అవుతుంది.

2019 ఎన్నికల ముందు బీజేపీ మ్యానిఫెస్టొలో ఉన్న హామీలకు, నేడు జగన్ తీసుకున్న నిర్ణయానికి మధ్య ఎటువంటి వ్యత్యాసం కనటంలేదు. ఇటువంటి సమయంలో కేంద్రం తమ అభిప్రాయాలకు భిన్నంగా వెళ్ళి జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం కనిపించటంలేదు. మ్యానిఫెస్టోలొ రాజధాని రైతుల పొలాలు తెలుగుదేశం లాక్కుని కుంభకోణం చేస్తుందని చెప్పిన బీజేపీ నేడు జగన్ అదే కుంభకోణాన్ని బట్టబయలు చేస్తే అడ్డుకుంటుందని చెప్పే పరిస్థితి ఉండదు. అలాగే బీజేపీ ఒక పక్క తన మ్యానిఫెస్టొలో పాలన వికేంద్రీకరణను నాడు సమర్దించి, ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న పాలన వికేంద్రికరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుందని చెప్పటంలో అర్ధం లేదు. రాయలసీమ హైకోర్టు విషయంలోను అంతే. పరిశీలించి చూస్తే కేవలం స్వార్ధ స్వప్రయోజనాల కోసమే ఒక పక్క పవన్ కళ్యాణ్ మరో పక్క పచ్చ బీజేపీ నేతలు కలిసి బీజేపీ అధిష్టానం అనే ముసుగు ధరించి ప్రజల మధ్య గందరగోళం సృష్టించే పని మాత్రమే చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Show comments