iDreamPost
android-app
ios-app

కోటి ఆర్థిక సాయం- ముఖ్యమంత్రిని అభినందిస్తున్న బీజేపీ నేతలు

కోటి ఆర్థిక సాయం- ముఖ్యమంత్రిని అభినందిస్తున్న బీజేపీ నేతలు

ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్‌ లీకేజీ అంశంలో జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరమైనప్పటికీ.. సీఎం జగన్ బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం కన్నా మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తరపున ముఖ్యమంత్రికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మానవ తప్పిదం వలనే ప్రమాదం జరిగిందని అన్నారు. వైజాగ్‌లో జరిగిన సంఘటన దురదృష్టకరమని, అలారం మోగించకపోవడం యాజమాన్యం తప్పుగా ఆయన పేర్కొన్నారు.

విశాఖపట్నానికే చెందిన బీజేపీ సీనియర్ నేత విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు ప్రకటించడం సామాన్య విషయం కాదని, తాను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని, కానీ పెద్ద మొత్తంలో, అక్కడికక్కడే ఇంత పెద్ద ప్యాకేజ్ ప్రకటించడం ఎవ్వరూ చేయలేదని చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌కు అభినందనలు తెలియజేశారు. ఇది రాజకీయం కాదని, మాట్లాడటానికి కానీ.. విమర్శలు చేయడానికి కానీ వీలు లేకుండా, బాధిత కుటుంబాలతో పాటు వారి తర్వాత జనరేషన్ కూడా ఆర్ధిక ఇబ్బందులు లేకుండా చేయూత నివ్వడాన్ని అభినందిస్తున్నానన్నారు

బీజేపీ అధికార ప్రతినిధి లక్ష్మీపతి రాజా మాట్లాడుతూ వెంటిలేటర్‌పై ఉన్న వాళ్లకు 10 లక్షలు, హాస్పిటల్‌లో చికిత్స పొందే వారికి లక్ష రూపాయలు ప్రకటించడం అభినందనీయమన్నారు. ఈ సంఘటన జరగటం దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన భగవంతున్ని ప్రార్థించారు.

విశాఖ దుర్ఘటన పై స్పందించిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ ఎల్‌జీ పాలిమర్స్ మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోటి రూపాయలు పరిహారం ప్రకటించటం హర్షణీయమని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ అన్నారు. ప్రతి ఇంటికి 10 వేలు ఇవ్వాలన్న నిర్ణయం కష్టకాలంలో ఓ గొప్ప సహాయంగా ఆయన పేర్కొన్నారు. బాధిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు అవసరమని అన్నారు.

ఒకపక్క ఇటీవల కాలంలో రాజకీయంగా కొంత దూరం పెరిగిందని భావిస్తున్న తరుణంలో విశాఖ ప్రమాదం రాజకియాంశం కానప్పటికీ జరిగిన ఈ సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలందరూ ముఖ్యమంత్రి కి బాసట గా నిలవడం విశేషం